క‌రెంటు లెక్క‌లు చెప్పిన శ్ర‌వ‌ణ్‌

Update: 2018-01-04 07:20 GMT
విద్యుత్ విష‌యంలో తాము సాధించిన విజ‌యం గురించి గొప్ప‌గా చెప్పుకుంటున్న కేసీఆర్ అండ్ కోపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. తాము క‌ష్ట‌ప‌డితే.. ఆ క‌ష్టాన్ని త‌మ విజ‌యంగా ప్ర‌చారం చేసుకుంటున్నారంటూ కేసీఆర్ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

లెక్క‌లు చెప్ప‌టంలోనూ.. ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్లు ఇవ్వ‌టంలో మంచి అనుభ‌వం ఉన్న దాసోజు శ్ర‌వ‌ణ్‌.. తాజాగా తెలంగాణ విద్యుత్ పై ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేష‌న్ ఇచ్చారు. ఆయ‌న చెబుతున్న లెక్క‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. 1952లో  2వేల మిలియ‌న్ యూనిట్లు ఉన్న విద్యుత్ సామ‌ర్థ్యాన్ని 2014 నాటికి 2,84,000 యూనిట్ల‌కు తీసుకెళ్లిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీద‌ని చెప్పారు.

2017-18 నాటికి అద‌న‌పు విద్యుత్ 9.8 శాతం ఉంటుంద‌న్న అంచ‌నా ఉంద‌ని.. కానీ.. ఇప్పుడు ఉన్నది అంత‌కంటే త‌క్కువ‌ని చెప్పుకొచ్చారు. 9.8 అద‌న‌పు విద్యుత్ ఉండాల్సి ఉంటే.. ఇప్పుడు ఉన్న‌ది కేవ‌లం 6.3 శాత‌మేన‌ని చెప్పిన శ్ర‌వ‌ణ్‌.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని చెప్పారు.

2014 జులై 2 నాటికి రాష్ట్రంలో 6547 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే 2017 అక్టోబ‌రు 1 నాటికి 14138 మెగావాట్ల ఉంద‌ని.. ఈ అద‌న‌పు 7564 మెగావాట్ల విద్యుత్ వివిధ ర‌కాల విద్యుత్ ఒప్పందాల వ‌ల్లే స‌మ‌కూరింది త‌ప్పించి కేసీఆర్ స‌ర్కారు ఏమీ ఉత్ప‌త్తి చేయ‌లేద‌ని చెబుతున్నారు. అయినా.. ప్రైవేటు సంస్థ‌ల నుంచి విద్యుత్ కొనుగోలు విష‌యంలో పెద్ద మ‌త‌ల‌బు ఉందంటూ స‌రికొత్త ఆరోప‌ణ చేశారు.

విద్యుత్ ఉత్ప‌త్తి విష‌యంలో టీఆర్ ఎస్ తీరుపై శ్ర‌వ‌ణ్ ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు. విద్యుదుత్ప‌త్తి విష‌యంలో కాంగ్రెస్ ఇసుకేసి.. ఇటుకేసి ఇల్లుక‌డితే దొడ్డిదారిన గృహ‌ప్ర‌వేశం చేసిన.. ఆ ఇల్లు నాదేన‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్పారు.  రాష్ట్రంలో 6570 మెగావాట్ల విద్యుత్ ఉంటే ప్ర‌క‌ట‌న‌ల్లో మాత్రం 14930 మెగావాట్ల విద్యుత్ ఉంద‌ని.. మ‌రి  అద‌నంగా తెచ్చిన  8 వేల మెగావాట్ల విద్యుత్ ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. విద్యుత్ లో తాము సాధించిన విజ‌యాల మీద త‌ర‌చూ గొప్ప‌లు చెప్పే సీఎం కేసీఆర్‌.. తాము సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌గ‌ల‌రా? అంటూ స‌వాలు విసురుతున్నారు.
Tags:    

Similar News