'కాంగ్రెస్ క‌త్తి ప‌డితే...మీరెవ్వ‌రు మిగ‌ల‌రు'

Update: 2018-01-27 08:28 GMT
నల్లగొండ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య తెలంగాణ‌లో అధికార  - ప్ర‌తిపక్షాల మ‌ధ్య ఆరోప‌ణ‌ల‌కు - ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతున్నాయి.   బొడ్డుపల్లి శ్రీనివాస్‌ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - సీఎల్‌ పీ నేత కె. జానారెడ్డి - ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - శాసన మండలి పక్షనేత షబ్బీర్‌ అలీ - మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు పరామర్శించారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ''కాంగ్రెస్‌ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ ను టీఆర్‌ ఎస్‌ నాయకులే హత్య చేయించారు. అందుకు నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశమే కారణం. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరూ మిగలరు.. కానీ, అది మా పద్ధతి కాదు'' అని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే శ్రీనివాస్‌ ను హత్య చేశారని - దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆర్నెళ్లుగా తీవ్ర బెదిరింపులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ ఘటనతో కేసీఆర్‌ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎవరి అండ చూసుకుని ఎమ్మెల్యే వేముల వీరేశం క్రిమినల్‌ చర్యలకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ఈ హత్య కేసును సీబీఐకి అప్పజెప్పి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. సీఎల్‌ పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ హత్యకు సీఎం కేసీఆర్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. శాసనమండలి పక్షనేత షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వీరేశానికి సీఎం మద్దతు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ్రీ‌నివాస్ హత్య ఎమ్మెల్యే వీరేశమే చేయించినట్టు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గ్యాంగ్‌ స్ట‌ర్‌ నయీంతో వీరేశానికి సంబంధాలున్నాయని - నయీం ఎన్‌ కౌంటర్‌ అయ్యాడు.. మరి వీరేశం ఎందుకు కాలేదని ప్రశ్నించారు. ఈ హత్యలో నల్లగొండ టీఆర్‌ ఎస్‌ ఇన్‌ ఛార్జి కంచర్ల భూపాల్‌ రెడ్డి హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఈ కేసును వదిలి పెట్టేది లేదన్నారు. కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైందన్నారు. సీఎల్‌ పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆరేళ్ల‌ కింద కొడుకు చనిపోయి సగం చచ్చిపోయానని - ఇప్పుడు ప్రాణానికి ప్రాణమైన సొంత తమ్ముడి లాంటోన్ని చంపారని కన్నీరు పెట్టారు. నల్లగొండ డీఎస్పీ సుధాకర్‌ ను ఇక్కడికి తీసుకొచ్చి అరాచకాలు చేయిస్తున్నారన్నారు. నిందితులు ఊట్కూరులో దాచుకున్నారన్నారు. హత్యలే చేయాలనుకుంటే మీరెవ్వరూ మిగలరని - కానీ..అది తమ పద్ధతి కాదంటూ హెచ్చరించారు.

ఇదిలాఉంగా...నల్లగొండ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ భర్త - కాంగ్రెస్‌ పార్టీ నాయకుడైన బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసులో నిందితులు ఎస్‌ పీ శ్రీనివాస్‌ రావు ఎదుట శుక్రవారం లొంగిపోయారు. హత్య జరిగిన రోజునే అనుమానితులుగా ఉన్న చక్రి - దుర్గయ్య - మోహన్‌ - ఎం.గోపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాండ్ర మల్లేశ్‌ - చింతకట్ల రాంబాబు - శరత్‌ ను 24 గంటల్లోపే అరెస్టు చేయడం - గొడవలు జరగకుండా చూడటంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అయితే, శ్రీనివాస్‌ కు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్న విమర్శలను పోలీసులు మూట గట్టుకున్నారు. శ్రీనివాస్‌ హత్య అప్పటికప్పుడు జరిగిందే తప్ప ఓ పథకం ప్రకారం జరిగింది కాదని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం.
Tags:    

Similar News