రాజ్య‌స‌భకు బైబై..చిరు సేవ‌లు జ‌న‌సేనకేనా?

Update: 2018-03-28 10:35 GMT
మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మ‌రో కీల‌క మ‌లుపు చోటుచేసుకోనుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ముగిసిన నేప‌థ్యంలో...చిరు పొలిటిక‌ల్ కెరిర్ ఇక ముగిసిన‌ట్లేన‌ని కొంద‌రు అంటున్నారు. అయితే త‌న సోద‌రుడు, ప‌వ‌ర్ స్టార్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకి చిరు సేవ‌లు అందించ‌నున్నారని జోస్యం చెప్తున్నారు. జ‌న‌సేన‌కు స‌ల‌హాదారుగా ఉంటార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అయితే అలాంటి అడుగు వేయ‌బోర‌ని...ఇక నుంచి ఆయ‌న సినిమాల వైపు ఆస‌క్తి చూపించ‌నున్నార‌ని చెప్తున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే చిరు పొలిటిక‌ల్ కెరీర్ ప‌దేళ్ల‌కే పూర్త‌యిపోయిన‌ట్ల‌ని వ్యాఖ్యానించారు.

దాదాపు దశాబ్దం కిందట చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది ప్రజారాజ్యం పార్టీ. ఆ తర్వాత కొంతకాలానికే వివిధ పరిణామాల మధ్యన చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లోకి విలీనం చేశారు. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2012 ఏప్రిల్‌ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో...చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది. 2104 లోక్‌సభ ఎన్నికల తర్వాత చిరంజీవి పార్లమెంటుకు హాజరుకావడం తగ్గించారు. అడపాడదపా హాజరైనా అదీ మొక్కుబడి తంతుగానే ముగించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన అక్బర్‌ రోడ్డు లోని బంగ్లాను ఖాళీ చేయడానికి నిరాకరించినప్పుడు.. పట్టణాభివృద్ధి శాఖ నోటీసులతో బలవంతంగా  ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఆతర్వాత రాజ్యసభ ఎంపీగా చిరంజీవి పురానా ఖిల్లా రోడ్డులోని ఏబీ-3 బంగ్లాను కేటాయించారు.

ఇదిలాఉండ‌గా...ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఏపీకి చెందిన అన్ని పార్టీలు తిరుగుబాటు చేస్తుంటే...కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా మీదేన‌ని అంటుంటే..అదే పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మాత్రం అసలు తనకు ఈ విషయంతో సంబంధమే లేనట్లుగా వ్యవహరిస్తుండటం అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభ‌వాన్ని చ‌విచూసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు - ఎంద‌రో సీనియర్లు అయిన...వయసు పైబడిన కేవీపీ లాంటి నేతలు సైతం ప్రత్యేక హోదా కోసం మేము సైతం అంటూ తమ వంతు తాముగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ పోరాటం చేస్తుంటే...ఎంతో జనాకర్షణ కలిగిన...చిరంజీవి లాంటి వ్యక్తి సైలెంట్ గా ఉండిపోవడం ఏ రకంగా చూసినా సమంజసం కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్యసభ సమావేశాలకు ఏపీ కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి డుమ్మా కొట్టారు.

ఒకవేళ తాను రాజకీయాల నుంచి విరమించుకోదలిచినా...ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా...ఒక రాజకీయ పార్టీ నుంచి పదవిని అనుభవిస్తున్ననేతగా... ప్రత్యేక హోదా విషయమై తన అభిప్రాయం ప్రకటించాల్సిన బాధ్యత తప్పకుండా చిరంజీవిపై ఉందంటూ ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగుతున్నాయి.చిరంజీవి రాజకీయ ప్రయాణంలో మరో అంకం ఏ విధంగా ఉంటుందో అనే చ‌ర్చ కూడా సాగుతోంది.
Tags:    

Similar News