సుప్రీంలో ఆ ఎంపీ పిటిష‌న్ మోడీషాల‌కు షాకిస్తుందా?

Update: 2019-04-29 10:48 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాలు చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల కోడ్ ను ప‌క్క‌న పెట్టేసి.. సైనిక బ‌ల‌గాల ప్ర‌స్తావ‌న అదే ప‌నిగా తీసుకువ‌స్తున్నా..ఈసీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వెల్లువెత్త‌టం తెలిసిందే.

ఈ మ‌ధ్య‌న ఒక స‌భ‌లో మాట్లాడిన మోడీ.. వింగ్ క‌మాండ్ అభినవ్ ను పాక్ వ‌దిలిపెట్ట‌కుంటే తాను చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించ‌టంతోనే వారు విడుద‌ల చేశార‌ని..ఒక‌వేళ పాక్ కానీ ఆ ప‌ని చేసి ఉండ‌క‌పోతే.. పాక్ భ‌విష్య‌త్తు త‌రాలు సైతం తాను చేసిన చ‌ర్య గురించి మాట్లాడుకునేవి అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవేకాకుండా.. సైనిక బ‌ల‌గాల ప్ర‌స్తావ‌న త‌మ ప్ర‌సంగాల్లో తేవాల్సిన అవ‌సరం లేకున్నా.. మోడీషాలు అదేప‌నిగా తీసుకురావ‌టాన్ని విప‌క్ష నేత‌లు పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎవ‌రెన్ని ఫిర్యాదులు చేస్తున్నా.. ఈసీ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని వేళ‌.. కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్ తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిష‌న్ ను జారీ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మోడీషాలు ప‌లుమార్లు ఎన్నిక‌ల కోడ్ ను అదే ప‌నిగా ఉల్లంఘించినా వారిపై మాత్రం చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ.. త‌న పిటిష‌న్ ను వెంట‌నే విచారించాల‌ని కోరారు. మోడీషాల‌పై 24 గంట‌ల్లో చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరారు.

సుస్మిత దేవ్ పిటిష‌న్ ను విచార‌ణ‌కు అంగీక‌రించిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. మంగ‌ళ‌వారం వాద‌న‌ల్ని వినిపించాల్సిందిగా కోరింది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో సాయుద బ‌ల‌గాల ప్ర‌స్తావ‌న తేకూడ‌ద‌న్న మాట స్ప‌ష్టంగా ఉన్నా.. దాన్ని ఉల్లంఘిస్తూ ఇప్ప‌టికే ప‌దిమార్ల‌కు పైనే మోడీషాలు త‌మ ప్ర‌సంగాల్లోకి తెస్తున్నార‌ని.. దీనిపై ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న ఆరోప‌ణ ఉంది. సుస్మిత్ దేవ్ పిటిష‌న్ మోడీషాల‌కు షాకింగ్ గా మారే అవ‌కాశం ఉందా? అన్న ఉత్కంట ఇప్పుడు ప్ర‌ధానాంశంగా మారింది.
Tags:    

Similar News