జ‌గ‌న్‌ కు జై కొడ‌తామంటున్న కాంగ్రెస్ నేత‌లు

Update: 2017-08-06 08:29 GMT
వ‌రుస చేరికల‌తో జోరుమీదున్న ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ..మ‌రింత దూకుడు పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి మ‌రీ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకుంటున్న నేప‌థ్యంలో మిగ‌తా పార్టీల నేత‌లు సైతం ఇదే దోర‌ణిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుస‌రిస్తున్న వైఖ‌రి - కాంగ్రెస్ పార్టీకి కోలుకునే చాన్స్‌ లేక‌పోవ‌డం, బీజేపీ భ‌విష్య‌త్‌ పై స్ప‌ష్ట‌త కొర‌వ‌డ‌టంతో ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతిపక్ష వైసీపీలోకి వలసల వరద పారనుందని తెలుస్తోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర సంద‌ర్భంగా మెజార్టీ నేత‌లు వైసీపీ కండువా క‌ప్పుకొనే చాన్స్ ఉంద‌ని అంటున్నారు.

అధికార తెలుగుదేశం పార్టీలో పొసగక పోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఆదరణ కరువవ్వడం వంటి కారణాలతో వారు ఇప్పుడు వైసీపీ వైపు దృష్టి సారించారు.వైసీపీ సీనియర్లతో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతోపాటు ఇటు తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు భారతీయ జనతాపార్టీకి చెందిన కొందరు నేత‌లు కూడా వైసీపీలోకి రావాలని యోచిస్తున్నట్లుగా స‌మాచారం.  కాంగ్రెస్‌ పార్టీ నుండి సీనియర్లంతా వరుసపెట్టి వైసీపీలో చేరేలా వైఎస్ ఆప్త‌మిత్రుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే తొలి దశలో విజయవాడ సెంట్రల్‌ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరిక అని అంటున్నారు. వాస్తవంగా పార్టీ ప్లీనరీలోనే కాంగ్రెస్‌ పార్టీ నుండి పలువురు చేరతారని ఆశించి నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదాపడింది. కానీ ప్రయత్నం మాత్రం ఆగలేదు. మాజీ మంత్రులు, దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డికి సన్నిహితులుగా ఉన్న అనంత, తూ.గో, కడప, నెల్లూరు నేతలు మొదటి దఫాగా వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. ఈమేరకు వీరంతా వైసీపీ సీనియర్ల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇద్దరు ఒకేసారి వైసీపీలోచేరి ఒకరు విజయవాడ మరొకరు నరసాపురం నుండి ఎంపీలుగా పోటీచేయనున్నారని అంటున్నారు. మాజీ ఎంపీలు ఇద్దరు వైసీపీలోకి వస్తారనే ప్రచారం కూడా ఉంది. వీరికితోడు అనంతపురం జిల్లా నుండి ఒక సీనియర్‌ నేత, ఆయనతో పాటు మరి కొంతమంది సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలనాటికి వైసీపీ కండువా కప్పుకునే అవకాశం కనిపిిస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ఇతర పార్టీలనుండి వచ్చిన పిిరాయింపుదారులకే అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రకాశం జిల్లా నేతల‌తోపాటు, కడప నేత కూడా టీడీపీలో ఉంటే లాభం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని ఒకానొక నేత కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేస్తారని విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక ఉప ఎన్నికలు జరుగుతున్న నంద్యాలలో కూడా దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రాణ మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా జగన్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన సంగతి విదితమే. ఇక బీజేపీ నుండి వైసీపీలోకి వలసలుంటాయని అంటున్నారు. కేంద్ర స్థాయిలో వారికి మంచి ప్రాధాన్యతను ఇస్తున్నప్పటికీ క్రియాశీలక రాజకీయాల్లో ఉండాలంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటేనే మంచిదని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాబోయే కాలంలో ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్ పాదయాత్ర సంద‌ర్భంగా ఈ చేరిక‌లు ఉంటాయ‌ని జోస్యం చెప్తున్నారు.
Tags:    

Similar News