గ్రేటర్ లో హస్తం పతనావస్థ

Update: 2016-01-14 10:42 GMT
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుంది. పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సమర్థుడైన మాస్ లీడర్ ఆ పార్టీకి కరువయ్యాడు. చిట్టచివరికి, దానం నాగేందర్ ను ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఉన్న ఏకైక మాస్ లీడర్ గా అభివర్ణించినా.. ఇప్పుడు దానం నాగేందర్ బాధ్యతల నుంచి కాస్త వెనక్కి తగ్గారు. దాంతో కాంగ్రెస్ కు మాస్ లీడరే కరువయ్యాడు. అది కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుందని, ఇది కాంగ్రెస్ కు కష్టకాలమేనని అంటున్నారు.

చాలా మంది ఆశ్చర్యపోతారు కానీ.. నిజాం కాలం నుంచీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సికింద్రాబాద్ కాలం నుంచీ ఇక్కడ కాంగ్రెస్ దే హవా. నిజాం కాలంలో కూడా మజ్లిస్ సొంతంగా అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఎన్నడూ లేదు. నిజాం కాలంలో మాడపాటి హనుమంతరావు వంటి వాళ్లు చక్రం తిప్పారు. అనంతర కాలంలో కూడా అధికారం కాంగ్రెస్ దే. సరోజినీ పుల్లారెడ్డి, రాణీ కుముదినీ దేవి వంటి వాళ్లు బల్దియా మేయర్లుగా చక్రం తిప్పారు. అప్పట్లో కాంగ్రెస్ కు మాస్ లీడర్లకు అస్సలు కొరత ఉండేదే కాదు. ఒకరి తర్వాత ఒకరుగా ప్రజా నాయకులు ఆవిర్భవించేవాళ్లు.

రెండు, మూడు దశాబ్దాల కిందట పి.జనార్దన రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు హైదరాబాద్ లో మరో ప్రజా నాయకుడు దొరికాడు. ఆయన మెడలో కండువా చుట్టుకుని ప్రజల్లోకి వెళ్లాడంటే ఓట్లు కురవాల్సిందేననే నానుడి ఉండేది. అప్పట్లో కార్మికులు, నిరుపేద బస్తీలు కాంగ్రెస్ కు కంచుకోటలుగా ఉండేవి. పి.జనార్దన రెడ్డి తర్వాత హైదరాబాద్ లో కాంగ్రెస్ కు సమర్థుడైన నాయకుడు కరువయ్యాడు. దానం నాగేందర్ కు కొంత వరకూ మాస్ ఇమేజ్ ఉంది. ఆయన మొత్తం హైదరాబాద్ కు నాయకుడిగా ఎదుగుదామని భావించినా.. కాంగ్రెస్ నేతలు అందుకు ససేమిరా అంటున్నారు. దాంతో ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నాడు. గత ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం ఉన్నా.. ఇప్పుడు అది కూడా లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులకు మాస్ ఇమేజీ లేదు. జానారెడ్డి, వీహెచ్ వంటి వాళ్లకు ఓట్లు పడే పరిస్థితి లేదు. కాస్త మాస్ ఇమేజీ ఉన్న దానం ఒక్కడూ అంతర్గత కుమ్ములాటలతో దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు హైదరాబాద్ ను ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు పతనావస్థకు చేరిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News