అలా చేయ‌క‌పోతే ముద్ర‌గ‌డ అరెస్టేన‌ట‌

Update: 2017-01-22 09:50 GMT
కాపు రిజర్వేషన్ల సాధన కోసం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన కాపు సత్యాగ్రహ పాద‌యాత్ర మ‌ళ్లీ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో ఈ నెల 25నుంచి ఆరు రోజుల పాటు తలపెట్టిన ఈ యాత్రకు అనుమతి లేదని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ తెలిపారు. గత సంఘటనల నేపథ్యంలో సత్యాగ్రహ యాత్రకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాదయాత్రకు ముద్ర‌గ‌డ‌ పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని లేని ప‌క్షంలో అరెస్టు చేయ‌డం త‌ప్ప‌ద‌న‌ ఎస్పీ రవిప్రకాశ్ విలేకరులతో చెప్పారు.

ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైన నేప‌థ్యంలో కాపు సంఘం నేత‌లు స్పందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ప్ర‌భుత్వం పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆక్షేపించారు. మిగ‌తా ఏ యాత్ర‌ల‌కు లేని అభ్యంత‌రం త‌మ‌కే ఎందుక‌ని ప్ర‌శ్నించారు. గుంటూరు జిల్లాలో శుద్ధి యాత్ర పేరుతో టీడీపీ నాయ‌కులు చేసిన యాత్ర‌కు అనుమ‌తి ఉందా అని కాపు నాయ‌కులు ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. అంతేకాకుండా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ రాజ‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ నిక‌ర‌స‌న తెలిపిన టీడీపీ నాయ‌కుల‌కు అనుమ‌తి ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా అణిచివేయాల‌ని చూస్తున్న‌ప్ప‌టికీ త‌మ పోరాటం ఆగ‌ద‌ని..పాద‌యాత్ర కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News