పిల్లల్లో నాలుగు దశల్లో కరోనా ...డీజీహెచ్‌ఎస్‌ మార్గదర్శకాలు !

Update: 2021-06-11 08:30 GMT
కరోనా వైరస్ తో పిల్లలకుపెద్ద ప్రమాదం లేదు. అయినప్పటికీ అలక్ష్యం, అలసత్వంగా ఉండకూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ సూచిస్తోంది. కరోనా వైరస్ పెద్దలతో పాటు పిల్లల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. అయితే, పెద్దలతో పోలిస్తే పిల్లల్లో దుష్ప్రభావాలు అతి తక్కువగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం 18 సంవత్సరాలు పైబడిన వారికి ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఇస్తూ వారికి రక్షణ కల్పిస్తోంది. కానీ, ఆలోపు వయసున్న వారికి టీకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలకు కరోనా సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స, సూచనలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీహెచ్‌ ఎస్‌ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఐదేళ్ల లోపు పిల్లలకు మాస్కు వినియోగించాల్సిన అవసరం లేదు. వారు మాస్కు సరిగ్గా వేసుకోకుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి సమస్యను బయటకు వ్యక్త పరచలేకపోవడంతో  కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇక వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి అందరిలో ఒకే రకంగా ఉన్నప్పటికీ ప్రభావం చూపడంలో తేడాలుంటున్నాయి.  

రెండు నెలల్లోపు పిల్లలు నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటారు. 2 నుంచి 12 నెలల్లోపు పిల్లలు 50 సార్లు, ఐదేళ్లలోపు పిల్లలు 40 సార్లు, 5 సంవత్సరాలు పైబడిన వారంతా 30 సార్లు శ్వాస తీసుకుంటారు. సాధారణంగా తీసుకునేదాని కంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తిస్తే సమస్య ఉన్నట్లేనని భావించవచ్చు. ఐదు సంవత్సరాలు పైబడినవారు శ్వాస తీసుకునే విధానాన్ని పరిశీలించే ముందు ఆరు నిమిషాల పాటు నడిచిన తర్వాత ఎన్నిసార్లు తీసుకుంటున్నారనేది పరిగణించాలి. రోజుకు మూడుసార్లు ఈ పరీక్ష చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా ఓ ఫార్మాట్‌ ను తయారు చేసుకోవాలి. పిల్లలు కరోనా పాజిటివ్‌ గా తేలితే తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడకూడదు. ప్రస్తుతం కరోనా సోకినవారిలో ఎక్కువమంది సీటీ స్కాన్‌ తీయించి స్కోర్‌ చూస్తున్నారు. పిల్లల్లో మాత్రం సీటీ స్కాన్‌ కు దూరంగా ఉండాలి. చిన్నపిల్లల్లో సాధారణంగా సీటీ స్కాన్‌లో తేడాలు ఉంటాయి.  

ఆస్పత్రిలో కరోనా వైరస్ చికిత్స పొందిన చిన్నారులు అతి తక్కువ మందిలో బ్లాక్‌ ఫంగస్‌ సోకే అవకాశం కూడా ఉంది. పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించాలి. పిల్లల్లో బ్లాక్‌ ఫంగస్‌ ప్రభావం ముక్కు, మెదడు, కడుపుల్లో ఉంటుంది. చర్మం నల్లబడడం, దంతాలు వదులు అయ్యి ఊడిపోవడం, కడుపు అప్‌సెట్‌ కావడం, వాంతులు, విరేచనాలు, పొట్ట భాగంలో వాపు లాంటివి ఈ కోవలోకే వస్తాయి.

నాలుగు దశల్లో ఇలా..
1.అసింప్టమాటిక్‌: శ్వాస గమనిస్తూ ఉండాలి
కోవిడ్‌–19 సోకినప్పటికీ అసింప్టమాటిక్‌గా ఉన్న చిన్నారుల్లో శ్వాస తీసుకునే విధానాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తుండాలి. అదేవిధంగా రక్తంలో ఆక్సిజన్‌ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

2,మైల్డ్‌: యాంటీబయోటిక్స్‌ వద్దు
వీరిలో ఎస్‌పీఓ2 (ఆక్సిజన్‌ శాచురేషన్‌ లెవల్‌) శాతం 94గా ఉంటుంది. ముక్కు కారడంతో పాటు జ్వరం ఉంటే అందుకు తగిన టాబ్లెట్లను వినియోగించాలి. దగ్గు ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిని తాగించే ప్రయత్నం చేయాలి. వీరికి ఎలాంటి యాంటీబయోటిక్స్‌ వినియోగించొద్దు. వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవే„క్షిస్తుండాలి.

3.మోడరేట్‌: లక్షణాలను బట్టి చికిత్స అవసరం
ఈ దశలోని పిల్లల్లో ఎస్‌పీఓ2 శాతం 90నుంచి 94 మధ్య ఉంటుంది. శ్వాస తీసుకునే విధానాన్ని వయసును బట్టి అంచనా వేయాలి. వీరిలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందించాలి. జ్వరం, దగ్గు ఉన్నప్పుడు అందుకు సంబంధించిన టాబ్లెట్లు తీసుకోవాలి. అవసరమైతేనే వైద్యుడి సలహా మేరకు ఆస్పత్రిలో చేర్చాలి.

4.సివియర్‌: ఆస్పత్రిలో చేర్చాల్సిందే
ఈ దశలోని పిల్లల్లో ఎస్‌పీఓ2 శాతం 90 కంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హోంఐసోలేషన్‌ కాకుండా తప్పకుండా ఆస్పత్రిల్లో చేర్చాల్సిందే. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత వైద్యులు పరిస్థితికి అనుగుణంగా చికిత్స ఇస్తారు. యాంటిబయాటిక్స్‌ను అవసరాన్ని బట్టి ఇస్తారు.
Tags:    

Similar News