ఇంటికి వెళ్లిన డాక్టర్ మీద పూలవర్షం కురిపించారు

Update: 2020-05-04 08:50 GMT
కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యులపైనా.. వైద్య సిబ్బంది మీదా కొందరు అనుచితంగా వ్యవహరిస్తుంటే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఆనందాన్ని మిగులుస్తున్నారు. ఇటీవల బెంగళూరులోని గాంధీ ఆసుపత్రి వైద్యురాలు విధులు ముగించుకొని ఇంటికి వెళితే.. అపార్ట్ మెంటు వాసులు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి తమ హర్షద్వానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అంతకు మించిన ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

భారత వాయు సేన కోవిడ్ మీద పోరు చేస్తున్న వైద్యుల మీదా.. వైద్య సిబ్బంది మీదా పూలవర్షాన్ని కురిపించి.. వారు చేస్తున్న పనికున్న ప్రత్యేకతను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఆదివారం గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తన ఇంటికి వెళ్లిన సందర్భంగా అనూహ్య పరిణామం ఒకటి ఎదురైంది.

ఆయన ఇంటికి దగ్గర్లో ఉన్న వారంతా ఆయనకు ఎదురెళ్లటమే కాదు.. ఆయన పై పూలవర్షం కురిపించారు. చప్పట్లు కొడుతూ సత్కరించారు. గాంధీ ఆసుపత్రి లో ఆదివారం ఉదయం వాయుసేన ఆధ్వర్యంలో  సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి మీద పూలవర్షాన్ని కురిపించారు. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత.. డాక్టర్ రాజారావు తన ఇంటికి వెళ్లారు. అనూహ్యంగా అక్కడి కాలనీ వాసులు.. అపార్ట్ మెంట్ వాసులు ఆయనకు ఎదురెళ్లి.. స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షాన్ని కురిపించారు. చప్పట్లతో ఆయనకు ఉత్తేజాన్ని ఇచ్చారు. ఇరుగుపొరుగు వారి అభినందనల మధ్య డాక్టర్ రాజారావు తడిచి ముద్దయ్యారు.
Tags:    

Similar News