తాజాగా 42 క‌రోనా పాజిటివ్‌.. తెలంగాణ‌లో మొత్తం కేసులు 1,551

Update: 2020-05-18 02:39 GMT
తెలంగాణలో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగానే ఉంటున్నాయి. కేసులు ఎక్క‌డా తగ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. తాజాగా ఆదివారం కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదైన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌టించింది.

తాజాగా న‌మోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా తేలింద‌ని వెల్ల‌డించింది. వీటితో క‌లిపి ఇప్పటివరకు క‌రోనా కేసులు మొత్తం 1,551కి చేరాయ‌ని తెలిపింది. అయితే ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం 21 మంది డిశ్చార్జయ్యారని ప్ర‌క‌టించింది. వీరితో కలుపుకుని ఇప్పటివరకు డిశ్చార్జ‌యిన వారి సంఖ్య మొత్తం 992 మంది. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 525కు చేరింది.

అయితే తెలంగాణ‌ లో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి కార‌ణం ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌స్తున్న వారి ద్వారేన‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 57 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ సంద‌ర్భంగా ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌స్తున్న వ‌ల‌స కార్మికుల‌కు విస్తృతంగా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.


Tags:    

Similar News