చైనా పోలికలున్న వారికి హైదరాబాద్ లో అవమానం

Update: 2020-04-09 15:00 GMT
కరోనా వైరస్ దెబ్బకు చైనా అన్నా.. చైనీయులు అన్నా ప్రపంచ వ్యాప్తంగా ఏహ్యాభావం కలుగుతోంది. దీంతో వారిని చూస్తేనే చాలు జనం ఈసడించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోనూ చైనీయుల పోలికలతో ఉన్న మణిపూర్ యువకులకు చేదు అనుభవం ఎదురైంది.

హైదరాబాద్ అంటే మినీ ఇండియా.. ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి స్థిర పడ్డారు. కాలనీలకు కాలనీలే ఆయా రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు చైనా వారి పోలికలతో ఉంటారు. అదే ఇప్పుడు వారికి శాపంగా మారింది.

తాజాగా మణిపూర్ రాష్ట్రానికి చెందిన యువకులు కొంత కాలంగా వనస్థలిపురంలో నివసిస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనడానికి తాజాగా వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ కు వెళ్లారు. అయితే చైనా వారి పోలికలతో వీరు ఉండడంతో ఖంగారు పడ్డ సూపర్ మార్కెట్ సెక్యూరిటీ గార్డులు వారిని ప్రవేశించడానికి అనుమతి నిరాకరించారు.

దీంతో తాము భారతీయులమేనని.. మణిపూర్ రాష్ట్రమని.. వనస్థలిపురంలో ఉంటున్నామని వారు చెప్పినా సెక్యూరిటీ గార్డులు పంపించలేదు. హైదరాబాద్ అడ్రస్ చూపించినా కనికరించలేదు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వైరస్ పుణ్యమాని చైనా పోలికలతో ఉన్న వారికి దేశంలో ఎంత వివక్ష ఎదురవుతుందో ఈ ఘటన కళ్లకు కడుతోంది.


వీడియో కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News