డేంజర్ వైరస్ తో డ్రాగన్ కు కొత్త దడ

Update: 2020-01-22 05:42 GMT
డేంజరస్ వైరస్ కరోనా ఇప్పుడు డ్రాగన్ దేశానికి కొత్త దడగా మారింది. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా తర్వాత మోస్ట్ పవర్ ఫుల్ దేశంగా చెప్పే చైనా ఇప్పుడీ వైరస్ పుణ్యమా అని చిగురుటాకులా వణికిపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అంతకంతకూ విస్తరిస్తోన్న కొత్త వైరస్ తో చైనా ఉక్కిబిక్కిరి అవుతోంది. ఈ వైరస్ ను గుర్తించిన వూహాన్ ప్రాంతం దాటి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో.. వైరస్ తీవ్రత అంతకంతకూ పెరగటమే కాదు.. వివిధ ప్రాంతాలకు విస్తరిస్తోంది.

 మంగళవారం నాటికి చైనాలో ఈ వైరస్ బారిన పడినోళ్లు సుమారు ఆరుగురు వరకూ మరణించినట్లుగా సమాచారం. మరోవైపు 300 మందికి తాజాగా ఈ వైరస్ సోకినట్లుగా చెబుతున్నారు. చైనా కొత్త ఏడాది సమీపిస్తున్న వేళ.. చైనీయులు ప్రయాణాలు ఎక్కువగా చేయటం కారణంగా ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తున్న దుస్థితి. దీంతో.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రయతం ఉందని భావిస్తున్నారు.

డిసెంబరు చివరిలో తొలిసారి కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయమైంది. చైనాలోని వూహాన్ లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్‌.. ఈ వ్యాధికి కేంద్ర స్థానమని భావిస్తున్నారు. అది అక్కడికే పరిమితమవుతుందన్న అంచనాలు విఫలం కావటమే కాదు.. అదిప్పుడు ఖండాలు దాటి తైవాన్.. ఫిలిప్పీన్స్.. ఆస్ట్రేలియాలకు పాకినట్లుగా వార్తలు వస్తున్నాయి.  తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం ఈ వైరస్ బీజింగ్.. షాంఘై.. గువాంగ్ డాంగ్ ప్రాంతాల్లోనూ వెలుగు చేసింది. మంగళవారం రాత్రి నాటికి మూడు వందల మంది ఈ వైరస్ బారిన పడితే.. మరో 900 మంది వైద్యుల పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మనుషుల నుంచి మనుషులతో పాటు.. జంతువుల నుంచి కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందన్న విషయాన్ని తాజాగా గుర్తించటం మరింత ఆందోళనలకు కలిగించే అంశంగా చెప్పాలి. ఈ వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేయటంతో పాటు.. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని కూడా అందుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆదేశాలు జారీ చేయటం చూస్తే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం కాక మానదు. జలుబుతో మొదలై తీవ్రస్థాయిలో శ్వాసకోశ వ్యాధులకు కారణంగా మారే లక్షణం ఈ వైరస్ సొంతం. గాలి ద్వారా కూడా ఇతరులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. దీంతో.. ప్రపంచ దేశాల్లోనూ ఈ వైరస్ విషయంలో అలెర్ట్ గా ఉంటున్నారు. దేశంలోని పలు విమానాశ్రయాల్లోనూ స్కానర్లను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రవేశించే ముందు.. ప్రయాణికుల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు.


Tags:    

Similar News