రెండు పార్టీల‌కు కార్పొరేట్లు ఇచ్చింది అన్ని వంద‌ల కోట్లు!

Update: 2017-08-18 04:15 GMT
అమెరికా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన వెంట‌నే.. కార్పొరేట్లు ఆ దేశ రాజ‌కీయాల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంటార‌న్న మాట వింటుంటాం. కొన్నేళ్లుగా కార్పొరేట్లు మ‌న రాజ‌కీయాల్ని కూడా శాసిస్తున్నార‌ని.. ఆ మాట‌కు వ‌స్తే.. ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు రాజకీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పేరుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక సంస్థ వెల్ల‌డించిన వివ‌రాలు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అవునా? అన్న క్వ‌శ్చ‌న్ రేకెత్తించేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్ రిఫార్మ్ సంస్థ ఒక నివేదిక‌ను త‌యారు చేసింది. దీనిక ప్ర‌కారం గ‌డిచిన నాలుగేళ్ల‌లో దేశంలోని జాతీయ‌పార్టీల‌కు కార్పొరేట్ కంపెనీలు ఎంత మొత్తాన్ని ఇచ్చింద‌న్న అంశాల్ని వెల్ల‌డించింది. నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో జాతీయ‌పార్టీల‌కు కార్పొరేట్ కంపెనీలు రూ.956.77 కోట్లు ఇచ్చిన‌ట్లు పేర్కొంది. ఇందులో అత్య‌ధికంగా (73 శాతం) రూ.705.81 కోట్లు బీజేపీకే అందిన‌ట్లుగా వెల్ల‌డించింది. నాలుగేళ్ల‌లో 2987 కంపెనీలు బీజేపీకి ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన‌ట్లుగా చెప్పింది.

అదే స‌మ‌యంలో విప‌క్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ కు రూ.198.16 కోట్లు అందించాయ‌ని పేర్కొంది. ఎన్సీపీకి రూ.50.73 కోట్లు.. సీపీఎంకు రూ.1.89కోట్లు.. సీపీఐకి రూ.18ల‌క్ష‌లు విరాళాలుగా అందాయి. అయితే.. బీజేపీకి భారీగా విరాళాలు ఇచ్చిన 1546 మంది వివ‌రాలు లేవ‌ని చెప్పింది. బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారిలో 99 శాతం మంది త‌మ నిధుల‌కు సంబంధించిన పాన్ నంబ‌ర్లు.. అడ్ర‌స్ లు వెల్ల‌డించ‌న‌ట్లుగా స‌ద‌రు సంస్థ పేర్కొంది.  గ‌డిచిన నాలుగేళ్ల‌లో ఐదు జాతీయ పార్టీల‌కు 1070.68 కోట్ల విరాళాలు అంద‌గా.. అందులో రూ.956.77 కోట్లు కార్పొరేట్ కంపెనీల నుంచి వ‌చ్చిందేన‌ని స‌ద‌రు సంస్థ పేర్కొంది. 2014-15 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీల‌కు కార్పొరేట్ ఫండింగ్ పెద్ద మొత్తంలో జ‌రిగింద‌ని ఏడీఆర్ చెప్పింది. అలా అందిన విరాళాల్లో ఎక్కువ భాగం బీజేపీకే వెళ్లాయ‌ని చెప్పింది. మ‌రి.. స‌చ్ఛీల‌త గురించి.. అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం గురించి మాట్లాడే మోడీ అండ్ షాలు త‌మ‌కు అందిన విరాళాల‌కు సంబంధించి పాన్ నెంబ‌ర్లు ఎందుకు లేన‌ట్లు? అన్న సందేహాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News