ఆదివారం ఆరుగురికి.. తెలంగాణలో 27కు పెరిగిన కరోనా కేసులు

Update: 2020-03-23 04:19 GMT
తెలంగాణలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు విస్తృతంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా ఆరుగురిలో వ్యాధి నిర్దారణ కావడం కలకలం రేపింది. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు ఉండడం గమనార్హం.ప్రస్తుతం ఈ ఆరుగురిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు.

ఆదివారం ఆరుగురికి కరోనా సోకడంతో తెలంగాణలో కరోనా బారిన పడిన సంఖ్య 27కు చేరింది.  ఇందులో 26 కేసులు కేవలం 9 రోజుల వ్యవధిలో నమోదుకావడం తెలంగాణలో వ్యాధి విస్తృతికి కారణమవుతోంది.

ఆదివారం హైదరాబాద్ కు చెందిన ఒక 50ఏళ్ల మహిళకు కరోనా వ్యాధి నిర్ధారణ అయ్యింది. ఈ నెల 14న  దుబాయ్ నుంచి భర్తతో కలిసి ఈమె వచ్చింది. మూడు రోజుల కిందటే ఈమె భర్తకు కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. శనివారం వీరి కుమారుడికి కరోనా వైరస్ గుర్తించారు. ఆదివారం ఈ మహిళలలోనూ నిర్ధారణ కావడంతో ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు ముగ్గురికి కరోనా వ్యాధి ప్రబలినట్లైంది.

ఈ పరిణామంతో తెలంగాణలో వైరస్ సోకిన వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు సోకే రెండో దశ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన దశ అని.. విస్తరణ ప్రారంభమైందని అర్థమవుతోంది. ఇక నుంచి కరోనా కేసులను ఆయా జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనే చికిత్స చేయాలని హైదరాబాద్ తీసుకురావద్దని మంత్రి ఈటల కోరారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 27 కేసుల్లో 12 కేసులు యూరప్ నుంచి వచ్చిన వారేనని గుర్తించారు. అత్యదికంగా ఇండోనేషియా నుంచి వచ్చిన ఆ దేశవాసులు 10 మంది, లండన్ నుంచి ఆరుగురు, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురికి కరోనా సోకింది. ఇండోనేషియా వాసులతో పాటు 10 మందిని ఎర్రగడ్డ చాతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.


Tags:    

Similar News