లోకేష్‌ కు మంత్రి ప‌ద‌వి ఇస్తే వారు ఊరుకోర‌ట‌

Update: 2017-02-04 07:40 GMT
త‌న కుమారుడు నారా లోకేష్ కు మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మొదలుపెట్టిన క‌స‌ర‌త్తుపై ఆదిలోనే నిర‌స‌న‌ల ప‌ర్వం మొద‌ల‌వుతున్న‌ట్లుగా ఉంది. ఇది సొంత పార్టీ నేతల రూపంలో జ‌రుగుతోందా? అని ఆలోచించ‌కండి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్క‌డుంది?! లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది వామ‌ప‌క్ష నేత‌ - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. సామాజిక హక్కుల వేదిక ప్రజాచైతన్యయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్న రామ‌కృష్ణ‌ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట తదితర ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న సందర్భంగా సభల్లోనూ, నరసాపురంలో విలేకర్లతోనూ మాట్లాడారు. నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని, అయితే లోకేష్‌ మంత్రి పదవి ఇస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్‌ లో గిరిజనులకు - మైనార్టీల‌కు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని రామ‌కృష్ణ‌ విమర్శించారు. వెనుక‌బ‌డిన త‌ర‌గతుల‌ అభివృద్ధి అంతంతమాత్రంగానే సాగుతోందని పేర్కొన్నారు. మైనార్టీల సంక్షేమం గాలికి వ‌దిలేశార‌ని త‌ప్పుప‌ట్టారు. ఇలా అన్నివ‌ర్గాలు ఆవేద‌నలో ఉంటే... చంద్ర‌బాబు మాత్రం త‌న కుమారుడికి ప‌ట్టాభిషేకం చేస్తుంటే ప్ర‌జ‌లు ఏ విధంగా చూస్తూ ఊరుకుంటార‌ని ప్ర‌శ్నించారు. సంపద - అధికారం - పరిశ్రమలు - వ్యాపారాల్లో ఎస్సీ - ఎస్టీ - బీసీ - ముస్లింలకు న్యాయపరంగా దక్కాల్సిన వాటాను కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి తీరాలని రామ‌కృష్ణ డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభజన బిల్లులోని హామీలన్నీ అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఒక్క మైనార్టీ వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా లేడని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలోని దళితులు, మైనార్టీలపై దాడులు మరింత పెరిగాయని రామ‌కృష్ణ విమ‌ర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News