ర‌ఘురామ‌పై ప‌రువు న‌ష్టం, క్రిమిన‌ల్ కేసు!

Update: 2022-03-23 13:35 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి న‌ర‌సాపురం ఎంపీగా గెలిచిన ర‌ఘురామ కృష్ణం రాజు ఇప్పుడు సొంత పార్టీకే గుదిబ‌డ్డ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. సీఎం జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ బెయిల్‌ను ర‌ద్దు చేయాలంటూ కోర్టునూ ఆశ్ర‌యించిన సంగతి తెలిసిందే. ఇలా జ‌గ‌న్‌కు ఈ రెబ‌ల్ ఎంపీ టార్గెట్ చేశార‌నే విష‌యం విదిత‌మే. ఇక త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని లోక్‌స‌భ స్పీక‌ర్‌కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం వేయ‌డంతో పాటు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేస్తామ‌ని ఏపీ ఎక్సైజ్ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ భార్గ‌వ తెలిపారు.

ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో క‌ల్తీ మ‌ద్యం అమ్ముతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా ఎంపీ ర‌ఘురామ చెబుతున్నారు. అయితే ఆ ప్ర‌చారంలో ఏ మాత్రం వాస్త‌వం లేద‌ని ర‌జ‌త్ భార్గ‌వ వెల్ల‌డించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అందులో భాగంగానే మ‌ద్యంలో హానిక‌ర ర‌సాయనాలు ఉన్న‌ట్లు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. మ‌ద్యం శాంపిల్స్‌ను లేబోరేట‌రీలో ప‌రీక్ష‌లు చేయించామ‌ని వాళ్లు చూపుతున్న ప‌త్రాలు కూడా త‌ప్పుడువేన‌ని ర‌జ‌త్ తెలిపారు.

ర‌ఘురామ అండ్ కో మ‌ద్యం శాంపిల్స్ ప‌రీక్ష చేయించామ‌ని చెబుతున్న చెన్నైలోని ఎస్‌జీఎస్ ల్యాబ్ నుంచి ఏపీ ఎక్సైజ్ శాఖ నివేదిక తెప్పించింది. మద్యం శాంపిళ్ల‌లో హానిక‌ర ర‌సాయ‌నాలు లేవ‌ని, పైగా ఆ మ‌ద్యాన్ని ఏపీ నుంచి తెచ్చిన‌ట్లు కూడా ఆధారాలు లేవ‌ని స్ప‌ష్ట‌మైంద‌ని ర‌జ‌త్ పేర్కొన్నారు. ఆ న‌మూనాల‌ను బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ 4449 (విస్కీ), 4450 (బ్రాందీ) ప్ర‌మాణాల ప్ర‌కారం ప‌రీక్షించ‌లేద‌ని ఎస్‌జీఎస్ ల్యాబ్ పేర్కొంద‌న్నారు.

ఈ మేర‌కు ల్యాబ్ ఇచ్చిన లేఖ‌ను ర‌జ‌త్ మీడియాకు చూపించారు. చైత‌న్య‌, ప‌వ‌న్ అనే వ్య‌క్తులు గ‌తేడాది డిసెంబ‌ర్ 11న నాలుగు విస్కీ, ఒక బ్రాందీ న‌మూనాల‌ను అన‌ధికారికంగా చెన్నైలోని ల్యాబ్‌కు పంపిన‌ట్లు తేలింది. డిసెంబ‌ర్ 24న వాళ్ల‌కు ప‌రీక్ష నివేదిక ఇచ్చిన‌ట్లు ల్యాబ్ తెలిపింది.

కానీ వీటిని ఏపీ నుంచి కొనుగోలు చేశారా? ప‌రీక్ష‌ల న‌మూనాల‌ను క‌ల్తీ చేసి పంపారా? అన్న‌ది తేలాల్సి ఉంద‌ని ర‌జ‌త్ చెప్పారు. ఎప్పటిక‌ప్పుడు మ‌ద్యం న‌మూనాల‌ను ఎన్నో విధాలుగా ప‌రీక్షిస్తున్నామ‌న్నారు. 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వరి వ‌ర‌కు 1,47,636 శాంపిళ్ల‌ను ప‌రీక్షించామ‌ని ఎందులోనూ క‌ల్తీ జ‌రిగిన‌ట్లు తేల‌లేద‌న్నారు.

హానికర ప‌దార్థాలు లేవ‌ని తేలింద‌ని చెప్పారు. ఇలా ప‌ని క‌ట్టుకుని మ‌రీ ప్ర‌భుత్వంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న ర‌ఘురామపై ప‌రువు న‌ష్టం దావా వేస్తామ‌ని ర‌జ‌త్ వెల్ల‌డించారు. క్రిమిన‌ల్ కేసు కూడా న‌మోదు చేస్తామ‌న్నారు.
Tags:    

Similar News