కేసీఆర్ ను తిట్టి ఇప్పుడు ఇదేం పని ‘రేవంతూ’

Update: 2021-07-03 06:29 GMT
‘మందికి మంగళవారం.. మనకు సోమవారం’ అన్నట్టుగా నేతలు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ప్రత్యర్థులను తిట్టడం వరకే నీతులు.. మనం పాటించడానికి కాదన్నట్టుగా ప్రవర్తిస్తారు. రాజకీయ నేతలు, సినీ తారలకు ముఖ్యంగా నమ్మకాలు ఎక్కువ. మహేష్ బాబు ‘మూడు అక్షరాల టైటిల్స్ ’తోనే సినిమా చేస్తుంటాడు. ఫస్ట్ షాట్ కు అటెండ్ కాడు. ఇక చిరంజీవి, బాలయ్య, కొత్త హీరోలు కూడా ఏదేదో నమ్మకాలతో వాటిని ఇప్పటికీ పాటిస్తుంటారు.

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఈ నమ్మకాలు ఎక్కువ. ముఖ్యంగా వాస్తు పరంగా సంఖ్యాశాస్త్రం పరంగా అన్ని మార్పులు చేసుకునేవారు మన సమాజంలో ఉన్నారు. అలా చేస్తేనే అదృష్టం వరిస్తుందని.. లేదంటే దురదృష్టం వెంటాడుతుందని నమ్ముతుంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే సీఎం కేసీఆర్ కు వాస్తు నమ్మకం ఎక్కువ. గద్దెనెక్కగానే ఉమ్మడి సీఎం బస చేసిన బేగం పేట సీఎం క్యాంపు కార్యాలయాన్ని వదిలేసి ప్రగతి భవన్ కట్టేసుకొని అందులోనే ఉంటున్నాడు. పక్కా వాస్తు ప్రకారమే ఈ ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇక సచివాలయం వాస్తు పరంగా లేదని.. గడిచిన ఏడేళ్లుగా దాని ముఖం కూడా చూపించకుండా ప్రగతి భవన్ నుంచే తెలంగాణను పాలిస్తున్నాడు.దీనిపై ఎన్నో విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గడం లేదు.

కేసీఆర్ వాస్తు నమ్మకాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ఎగతాళి చేశాడు. ‘నాన్ వర్కింగ్ సీఎం’ అంటూ.. వాస్తు కారణంగా సచివాలయం కడుతూ కొన్ని వందల కోట్లు  కేసీఆర్ దుబారా చేశాడని ఆరోపించారు. ఇప్పుడు హఠాత్తుగా రేవంత్ సైతం అదే బాటలో నడుస్తుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

మనదాకా వస్తే కానీ ఆ నమ్మకం విలువ తెలియదంటారు.. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ‘వాస్తు’ నమ్మకాన్ని ఎగతాళి చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు తన కుర్చీ పదిలం చేసుకోవడానికి గాంధీ భవన్ లో వాస్తు మార్పులు చేస్తున్న వైనం చర్చనీయాంశమైంది..

పీసీసీ చీఫ్ గా అధిష్టానం ప్రకటించిన వెంటనే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లోని వాస్తుదోషంపై దృష్టిపెట్టారు. తూర్పు వైపు మరో ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. పీసీసీ చాంబర్ తూర్పులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గాంధీ భవన్ లోని ప్రచార సామగ్రి ఉండే గదిని తొలగిస్తున్నారు. ఆయన అనుచరులు ఈ మార్పులన్నీ దగ్గరుండి రాత్రి పగలూ తేడా లేకుండా చేస్తున్నారు. పీసీసీ చీఫ్ గా 7వ తేదీన రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకునేలోపే వీటన్నింటిని పూర్తి రేవంత్ కు వాస్తు దోషం లేకుండా కుర్చీలో కూర్చుండబెట్టాలని డిసైడ్ అయ్యారట.. ఇలా రేవంత్ సైతం వాస్తు నమ్మకాన్ని ఇంతలా పాటిస్తారా? అన్న విషయం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Tags:    

Similar News