ఏపీలో వార్దా ఎఫెక్ట్ ఏంటి?

Update: 2016-12-12 07:12 GMT
వార్దా తుపాను ముంచుకొస్తోన్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ల‌కు ఈ బృందాలు క‌దిలాయి.  చెన్నయికి మూడు ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు వెళ్ల‌గా తిరువళ్లూరుకు రెండు బృందాలు, కాంచీపురం జిల్లాకు రెండు బృందాలు వెళ్లాయి.   ఏపీలోని విశాఖప‌ట్నానికి ఇప్ప‌టికే ఎన్డీఆర్ఎఫ్‌ బృందం చేరుకుంది. గుంటూరుకు మరో బృందాన్ని పంపించారు.  ఏపీలో తీవ్రత తక్కువగానే ఉండనుండడంతో రెండు బృందాలతోనే సరిపెట్టనున్నట్లు సమాచారం.

    వార్ధా తుపానును ఎదుర్కొనేందుకు మొదటిసారిగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇచ్చిన సూక్ష్మస్థాయి నివేదికను ఏపీ ఉపయోగించుకుంటోంది. మరోవైపు ఇప్పటికే ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.  అయితే... హుదూద్ తుపాను కన్నా వార్ధా తుపాను తీవ్రత తక్కువే అని తెలుస్తోంది. దీని ప్రభావంతో గంటకు గరిష్ఠంగా 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది.

    తుపాను 12వ తేదీ సాయంత్రానికి శ్రీహరికోట- కృష్ణపట్నం మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇస్రో శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా ఆపేశారు.  నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సమీపంలో ఈ రోజు తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News