సెటిలర్లపై డీఎస్‌కు ఎంత ప్రేమ!?

Update: 2015-07-03 14:05 GMT
తెలంగాణలో సెటిలర్ల భద్రత కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరానని, సెటిలర్ల భద్రత కోసం తాను ప్రయత్నిస్తానని ప్రకటించిన ధర్మపురి శ్రీనివాస్‌కు వారిపై ఎంత ప్రేమోనని కాంగ్రెస్‌ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఒకపక్క ఆంధ్రా పాలకులను విమర్శిస్తున్నారని.. మరోవైపు హైదరాబాద్‌లో సెటిలర్లకు రక్షణగా ఉన్న సెక్షన్‌ 8ని వ్యతిరేకిస్తున్నారని.. అదే సమయంలో సెటిలర్ల భద్రత కోసం ప్రయత్నిస్తానని అంటున్నారని.. ఇదేం పరస్పర విరుద్ధ వ్యాఖ్యలని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి, నిజామాబాద్‌ జిల్లాలో సీమాంధ్ర నుంచి వచ్చిన సెటిలర్లు అధికం. డీఎస్‌ నియోజకవర్గంలో కూడా వారి ప్రాబల్యమే ఎక్కువ. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌లోకి చేరితే వారంతా డీఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారు కదా! ఇప్పటికే వారంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకమని, ఇప్పుడు డీఎస్‌, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకమైతే వచ్చే ఎన్నికల్లో తనకు కానీ తన కుమారుడికి కానీ వారి నుంచి ఒక్క ఓటు కూడా పడదని, ఈ ప్రమాదాన్ని ఊహించే డీఎస్‌ ముందు  జాగ్రత్త చర్యగా సెటిలర్ల భద్రత అంశాన్ని ప్రస్తావించారని కాంగ్రెస్‌ నేతలు వివరిస్తున్నారు.

కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం రూపకల్పనతో ఏ దశలోనూ డీఎస్‌ సీమాంధ్రుల భద్రత గురించి పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. గత ఏడాదిగా సీమాంధులకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలనూ ఆయన ఖండించలేదని గుర్తు చేస్తున్నారు. కేవలం నిజామాబాద్‌లో వారి ఓట్ల కోసమే ఆయన సెటిలర్ల పాట పాడారని వివరిస్తున్నారు.

Tags:    

Similar News