కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అలిగాడు..!

Update: 2015-06-29 06:18 GMT
ఇటీవలే దిగ్విజయ్‌ సింగ్‌ విషయంలో తన అసంతృప్తిని వెల్లగక్కాడు పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన దిగ్విజయ్‌ సింగ్‌ తీరు వల్లనే తనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదని.. ఆయన వల్లనే తను మాజీ ఎమ్మెల్సీ హోదాకు పరిమితం అయ్యానని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించాడు. అధిష్టానం తనను తిరిగి ఎమ్మెల్సీ చేయడం పట్ల సానుకూలంగానే ఉన్నా దిగ్విజయ్‌ పడనీయలేదని.. తనను మాజీ ఎమ్మెల్సీని చేసి కూర్చొబెట్టాడని శ్రీనివాస్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    మరి సాధారణంగా రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిపై బహిరంగంగా అసంతృప్తి చేసే కాంగ్రెస్‌ నేతలు తక్కువమందే ఉంటారు. కానీ దిగ్విజయ్‌ విషయంలో డీఎస్‌ ఎక్కడా తగ్గలేదు.

    ఆయన వల్లనే తనకు పదవి దక్కలేదని స్పష్టం చేశాడు. మరి ఈ అసంతృప్తిని ఇప్పటికే వెల్లగక్కిన డీఎస్‌ తాజాగా మరోసారి దాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ను కలవలేదు డీఎస్‌.

    ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో దిగ్విజయ్‌ సమావేశం అయ్యాడు. వారికి దిశానిర్దేశం చేస్తూ చర్చలు.. సమావేశాలు నిర్వహించాడు. వీటికి కాంగ్రెస్‌ నేతలందరూ హాజరయ్యారు. అయితే డి.శ్రీనివాస్‌ మాత్రం ఈ కార్యక్రమాలకు రాలేదు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ చొరవచూపి శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి దీన్ని బట్టి శ్రీనివాస్‌ అలిగాడనుకోవాల్సి వస్తోందని.. ఈ విధంగా దిగ్విజయ్‌కు తన నిరసనను తెలిపాడని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.



Tags:    

Similar News