దాడి వీర‌భ‌ద్ర‌రావును చూసి విశాఖ న‌వ్వుతోందా!

Update: 2020-01-22 05:23 GMT
దాడి వీర‌భ‌ద్ర‌రావు.. ఒక‌ప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా హ‌డావుడి చేసిన నేత‌. ఆ పార్టీలో ఆయ‌న అనుభ‌వించిన ప‌ద‌వులు ఏమో కానీ... అప్ప‌ట్లో వైఎస్ ప్ర‌భుత్వంపై అనునిత్యం తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ద్వారా మాత్రం వార్తల్లో ఉండేవారు ఆయ‌న‌. వైఎస్ ప్ర‌భుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన తెలుగుదేశం పార్టీ నేత‌ల్లో అప్ప‌ట్లో దాడి ముందు వ‌ర‌స‌లో ఉండేవారు. అలాంటి వారిలో కొంద‌రు ఆ త‌ర్వాత రాజ‌కీయంగా తెర‌మ‌రుగు అయ్యారు. అయితే దాడి వీర‌భ‌ద్ర‌రావు మాత్రం.. ఏ గాలికి ఆ చాప అన్న‌ట్టుగా.. వ్య‌వ‌హ‌రిస్తూ ఉన్నారు.

వైఎస్ ప్ర‌భుత్వం పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన దాడి వీర‌భ‌ద్ర‌రావు ఆ త‌ర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన‌ప్పుడు చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. మ‌రీ అంత మార్పా అనుకున్నారు. అయితే ఆ మార్పు అంత‌టితో ఆగిపోలేదు కూడా. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాడి వీర‌భ‌ద్ర‌రావు ఆ ఎన్నిక‌ల్లో త‌న త‌న‌యుడిని ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయించారు. అయితే నెగ్గుకురాలేక‌పోయారు.

ఆ వెంట‌నే దాడిలో మార్పు క‌నిపించింది. ఆయ‌న వైసీపీ పై అసంతృప్తుడు అయ్యాడు. జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డం ప్రారంభించాడు. మ‌ళ్లీ తెలుగుదేశం పార్టీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే చంద్ర‌బాబు  నాయుడు మాత్రం దాడిని ప‌ట్టించుకున్న‌ట్టుగా లేరు. అటూ ఇటూ ఫిరాయించే స‌రికి దాడి అలా న‌మ్మ‌కాన్ని కోల్పోయాడు.

అయితే దాడి అలా కూడా కామ్ గా ఉండ‌లేక‌పోయారు. మ‌ళ్లీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయ‌న ద‌గ్గ‌ర‌య్యారు. 2019 ఎన్నిక‌ల ముందు మ‌ళ్లీ వైసీపీలోకి చేరారు. టికెట్ కోసం ప్ర‌య‌త్నాలు సాగాయి. అయితే ఈ సారి జ‌గ‌న్ కూడా ఆయ‌న‌ను విశ్వాసంలోకి తీసుకున్న‌ట్టుగా లేరు. ఇక ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఆయ‌న కొన‌సాగుతూ ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న చంద్ర‌బాబు మీద తీవ్రంగా విరుచుకుప‌డుతూ ఉన్నాడు. అలాంటి విమ‌ర్శ‌ల‌తో ఎలాగైనా జ‌గ‌న్ దృష్టిలో ప‌డాల‌నేది దాడి వీర‌భ‌ద్ర‌రావు ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తూ ఉంది. అయితే ఇప్ప‌టికే ప‌లు సార్లు అటూఇటూ తిరిగి.. ఇప్పుడు ఆయ‌న మాట్లాడుతున్న తీరుపై విశాఖ జ‌నాలు మాత్రం ఆశ్చ‌ర్య‌పోతూ ఉన్నారు. ఈయ‌న ఎప్ఉడు ఏ ఆప‌ర్టీని విమ‌ర్శిస్తారో.. ఎవ‌రికీ తెలియ‌దు అన్న‌ట్టుగా వారు స్పందిస్తున్నారు.
Tags:    

Similar News