ద‌ళిత కార్య‌క‌ర్త‌తో చ‌ర్చ ర‌ద్దు.. గూగుల్ చేసిన ప‌నేంటంటే!

Update: 2022-06-05 10:47 GMT
ద‌ళితులు ఎక్క‌డ ఉన్నా.. అవ‌మానాల‌కు గుర‌వుతున్నారా?  గ్రామ స్థాయి నుంచి అంత‌ర్జాతీయ స్థాయి వ‌ర‌కు ద‌ళితుల విష‌యంలో అన్యాయాలు జ‌రుగుతూనే ఉన్నాయా?  ద‌ళితుల విష‌యంలో ప్ర‌జ‌ల దృక్ఫ‌థాలు మార‌డం లేదా.. అంటే.. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ఔన‌నే చెబుతోంది. ద‌ళితుల‌కు స్వ‌దేశంలోనే కాదు.. పొరుగు దేశాల్లోనూ గౌర‌వం లేకుండా పోయింద‌ని తాజా ఘ‌ట‌న రుజువు చేసింది.

అమెరికాలో నివిస్తున్న దళిత హ‌క్కుల‌ కార్యకర్త, త‌మిళ‌నాడుకు చెందిన‌ తేన్‌మొళి సౌందరరాజన్ విషయంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ గూగుల్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. తీవ్ర వివాదానికి దారితీసింది. తేన్‌మొళి.. కొన్ని ద‌శాబ్దాలుగా.. ద‌ళితుల హ‌క్కుల కోసం పోరాడుతున్నారు. వారి ప‌ట్ల త‌న స్వ‌రాన్ని వినిపిస్తున్నారు. దీంతో గూగుల్ ఆమెతో ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేసింది. షెడ్యూల్ ప్ర‌కారం.. ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల్సి ఉంది.

కానీ.. ఏం జ‌రిగిందంటే..

స‌మాజంలో `స‌మాన‌త్వం` కోసం.. అనేక పోరాటాలు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తేన్‌మొళి కూడా.. ఉద్య‌మాలు సాగిస్తున్నారు. ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆమెతో చ‌ర్చ‌కు గూగుల్ సీనియ‌ర్ మేనేజ‌ర్ త‌నూజా గుప్తా.. ఒక కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే.. తేన్‌మొళితో చ‌ర్చ‌ను గూగుల్ ఉద్యోగులే తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేకించారు.

ఈ విష‌యంలో త‌మకు "ప్రాణాలకు ప్రమాదం`` ఉంద‌ని పేర్కొంటూ.. ఉద్యోగులు భారీ సంఖ్య‌లో ఈ మెయిల్స్ పంపించారు. ఉద్యోగుల సెన్సిటైజేషన్ కోసం కంపెనీ డైవర్సిటీ ఈక్విటీ ఇన్‌క్లూసివిటీ(DEI) ప్రోగ్రామ్‌లో ప్రెజెంటేషన్  చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈక్వాలిటీ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న తేన్‌మొళిని "హిందూ ఫోబిక్", "హిందూ వ్యతిరేకి" అని పేర్కొన్నారు.  

దీంతో గూగుల్ ఈ చ‌ర్చ‌ను ర‌ద్దు చేసింది. దీనిని తీవ్రంగా భావించిన  సీనియర్ మేనేజర్ తనూజా గుప్తా త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. తేన్‌మొళి ప్రసంగాన్ని వ్యతిరేకించిన గూగుల్ ఉద్యోగులు "కుల సమానత్వంపై చర్చ వల్ల తమ జీవితాలు ప్రమాదంలో పడ్డాయి" అని పేర్కొన్నారు. 8,000 మందితో కూడిన దక్షిణాసియా ఉద్యోగుల బృందానికి ఈ మెయిల్ వెళ్లినట్లు నివేదిక పేర్కొంది.

భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థ కారణంగా ప్రజలు కుల సమానత్వాన్ని 'అగ్రవర్ణాలపై వ్యతిరేక వివక్ష' అని పిలిచారని కూడా నివేదిక జోడించింది. గూగుల్‌లోని తనూజా గుప్తా అనే సీనియర్ మేనేజర్, జూన్ 1, బుధవారం కంపెనీకి రాజీనామా చేశారు, దళిత హక్కుల కార్యకర్తను "హిందూ వ్యతిరేకి" అని పిలిచే ఇమెయిల్‌లను అనుసరించి కులం గురించి ప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతించకపోవడంతో ఆమె రాజీనామా చేశారు.  ప్ర‌స్తుతం ఈ విష‌యం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News