విశాఖ ఇమేజ్ కి బిగ్ డ్యామేజ్!

Update: 2023-06-15 22:04 GMT
విశాఖ అంటే భద్రత నగరం అని అంతా అంటారు. ప్రశాంతతకు మారు పేరుగా చెబుతారు. అలాంటి సిటీలో హత్యలు జరుగుతున్నాయి. రౌడీ షీటర్లు విచ్చలవిడిగా దందాలు చేస్తున్నారు. భూకబ్జాలకు హద్దే లేదు. ఇపుడు అన్నింటికీ పరాకాష్టగా ఒక ఎంపీ అధికార పార్టీకి చెందిన కీలక నేత ఫ్యామిలినే కిడ్నాప్ చేసి ఏకంగా మూడు రోజుల పాటు చిత్ర హింస పెట్టిన ఘటన నగరానికి బిగ్ షాక్ గా మారింది.

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడు, ఆయన స్నేహితుడు కం వైసీపీ కీలక నేతలను కిడ్నాపర్లు విశాఖ శివారు అయిన రుషికొండలో మూడు రోజుల పాటు బంధించి నానా రకాలుగా బాధలు పెట్టారు. ఎంపీ ఎంవీవీ అలెర్ట్ అయి పోలీసులకు మెసేజ్ ఇవ్వడంతో వారు చాకచక్యంతో కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఎంపీ ఫ్యామిలీని విడిపించారు. లేకపోతే వారి పరిస్థితి ఏమవుతుందో అన్నది ఇపుడు చర్చగా ఉంది.

ఎంపీ ఎంవీవీ హైదరాబాద్ లో ఉన్న టైం లో ఈ ఘటన జరిగింది. సరిగ్గా మూడు రోజుల క్రితం ఎంపీ కుమారుడు శరత్ చౌదరి ఉంటున్న ఇంటికి వెళ్ళి కిడ్నాపర్లు తమ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మొదట ఆయన్ని బంధించి ఆయన ఫోన్ నుంచి ఎంపీ  భార్యను రప్పించారు. ఇలా ఎంపీ కుమారుడు మూడు రోజుల పాటు, ఎంపీ భార్య రెండు రోజుల పాటు కిడ్నాపర్ల బాధలను అనుభవించారు. వారి ఫోన్ ను అందుకున్న ఆడిటర్ జీవీ అలియాస్ జీ వెంకటేశ్వరరావు వెళ్ళి కిడ్నాపర్ల చెరలో ఇరుక్కున్నారు.

ఇలా తన ఫ్యామిలీని నిర్భంధించి చిత్రహింసలు పెట్టారని, తాను జీవీ ఫోన్ ట్రాక్ చేయమని పోలీసులను కోరడంతో చాలా చాకచక్యంగా పోలీసులు ఈ కిడ్నాప్ కధను సుఖాంతం చేశారు అని మీడియా ముందుకు వచ్చి ఎంపీ చెప్పుకొచ్చారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైసీపీ ఎంపీ అనడమే ఇపుడు చర్చనీయాంశంగా ఉంది.

అదే టైం లో తనకు రాజకీయంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎవరూ శత్రువులు లేరని, కానీ కిడ్నాప్ కేవలం డబ్బు కోసమే జరిగిందని భావిస్తున్నాను అంటున్నారు. దీని వెనక ఉన్న పాత్రధారులు సూత్రధారులను పట్టుకోవాలని ఆయన కోరుతున్నారు.

ఇదిలా ఉండగా విశాఖలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో సిటీ మొత్తం చర్చకు తావిస్తోంది. ఒక ఎంపీ ఫ్యామిలీకే భద్రత లేదా అన్న చర్చ వస్తోంది. అసలు విశాఖకు ఏమి జరిగింది. ఎందుకు ఇలా రౌడీ షీటర్లు నేరగాళ్ళు బరితెగిస్తున్నారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రౌడీ షీటర్లు కొట్టుకుని రోడ్ల మీద హత్యలు చేసుకోవడం ఇటీవల పరిపాటి అవుతోంది. అలాగే భూ దందాలు కామ్న్ అవుతున్నాయి.

ఇవన్నీ విశాఖ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉంటే ఇపుడు ఏకంగా ఎంపీ ఫ్యామిలీకే సేఫ్టీలేదంటే సామాన్యుల మీద కిడ్నాపర్లు రౌడీ షీటర్లు ఎలా తెగబడతారో అన్న భయాలు కలుగుతున్నాయి. దీని మీద టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ విశాఖలో శాంతిభద్రతలు లేవు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ ఫ్యామిలీకే ఇలా జరిగితే ఇక సామాన్యుడి గతేంటి అని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే విశాఖలో అరాచకాల మీద విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో మీటింగ్ పెట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ అరాచకాలకు అడ్డాగా మారుతోంది అని విమర్శించారు. విశాఖలో నేరగాళ్ళకు హద్దులేకుండా పోతోంది అని ఇతర విపక్షాలు అంటున్నాయి. ఇవన్నీ చూస్తూంటే సిటీ ఆఫ్ డెస్టినీ  గా   పేరు గడించిన విశాఖ ఈ రోజు ఇలా ఎందుకు తయారైంది అన్నదే ఒక సందేహంగా ఉంది. ప్రభుత్వానికి ఎన్నికల ఏడాదిలో ఇది ఒక సవాల్ గా మచ్చగా కూడా ఉంటుందని అంటున్నారు.

Similar News