కరోనా వేళ మోడీకి సలహా ఇచ్చేందుకు మాజీ రాష్ట్రపతి.. ప్రధానులు భేటీ అయితే?

Update: 2021-04-27 03:30 GMT
ఇటీవల కాలంలో ఎప్పుడూ ఎదురుకాని దారుణమైన పరిస్థితుల్ని దేశం ఎదుర్కొంటోంది. కరోనా బారిన సామాన్యులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. వారి అంతిమసంస్కారాలు చేసేందుకు వీలు లేక.. రహదారుల పక్కన.. పేవ్ మెంట్ పక్కన దహన సంస్కారాలు చేస్తున్న దుస్థితి. శ్మశానాలు మొత్తం ఎర్రటి మంటలు.. నల్లటి పొగలతో విషాద మేఘం దేశం మొత్తం కమ్మేస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఊహించని కేంద్రంలోని మోడీ సర్కారు చేష్టలుడిగిపోయినట్లుగా ఉండిపోతోంది. నిర్ణయాలు తీసుకుంటున్నా.. అవేమీ పరిస్థితుల్ని మార్చలేకపోతున్నాయి. ఇలాంటివేళ దేశానికి దిశానిర్దేశం చేసేటోళ్లు ఎవరున్నారు?వారేం చేస్తే బాగుంటుందన్నది ప్రశ్నగా మారింది.

ఇలాంటివేళ.. దేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు.. ఉప రాష్ట్రపతి పదవిని విజయవంతంగా పూర్తి చేసినోళ్లు.. దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారు సమావేశం కావాల్సిన పరిస్థితి వచ్చిందా? అంటే అవునని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ఒక బలమైన అభయ హస్తం అవసరమైంది. ఎవరి మాటా వినని మోడీ లాంటి ప్రధానికి సలహాలు ఇచ్చేందుకు.. సూచనలు చేసేందుకు ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో సమావేశం అయితే ఎలా ఉంటుంది.

దేశం ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులను సమీక్షించి.. ఏమేం చేయాలన్న విషయంపై ఒక మార్గదర్శక పత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అన్నది ఒక ప్రశ్న. ఇలాంటప్పుడు దేశానికి రాష్ట్రపతులుగా వ్యవహరించిన వారిలో ఇప్పటికి జీవించి ఉన్నదెవరన్నది చూస్తే.. షాకింగ్ నిజం బయటకు వస్తుంది. ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతి పదవిని చేపట్టగా.. ప్రస్తుతం పదవిలో ఉన్న కోవిండ్ ను పక్కన పెడితే.. మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో ఒక్క ప్రతిభా పాటిల్ మాత్రమే జీవించి ఉన్నారు. మిగిలిన వారంతా కీర్తిశేషులు అయ్యారు.

ఉప రాష్ట్రపతుల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 13 మంది ఈ పదవిలో ఉంటే.. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న వెంకయ్యనాయుడిని మినహాయిస్తే.. 12 మంది ఉంటారు. వారిలో.. మహమ్మద్ హమీద్ అన్సారీ మాత్రమే జీవించి ఉన్నారు.

దేశ ప్రధానులుగా పని చేసిన వారిని చూస్తే.. ఇప్పటివరకు 14 మంది ప్రధానులుగా ఆ పదవిని చేపట్టారు. ప్రస్తుతం ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ కాకుండా.. జీవించి ఉన్న మాజీ ప్రధానులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు దేవగౌడ కాగా మరొకరు మన్మోహన్ సింగ్.

అంటే.. దేశ అత్యున్నత పదవుల్నిచేపట్టిన మాజీల్ని చూస్తే.. మొత్తంగా నలుగురు మాత్రమే ఉన్నారు. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఈ నలుగురు ఒకచోట సమావేశమై.. పరిస్థితిని సమీక్షించి.. ప్రధాని మోడీకి.. కేంద్ర ప్రభుత్వానికి సలహాలు.. సూచనలు ఇవ్వటంతో పాటు.. దేశ ప్రజలకు ఉమ్మడిగా ఒక సందేశాన్ని ఇస్తే.. ఒక ఓదార్పుగా నిలుస్తుందని చెప్పక తప్పదు. కాకుంటే.. ఈ రోజున దేశానికి అతిపెద్ద పదవులకు ప్రాతినిధ్యం వహించిన మాజీల సంఖ్య ఇంత తక్కువగా ఉందన్న ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు.
Tags:    

Similar News