పాడె మోసే నలుగురు లేక ..పట్నంలోనే మట్టిలోకి !

Update: 2021-05-15 07:30 GMT
కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో బాగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి భారిన పడి మరణించే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. కరోనా తో కొందరు , ఆక్సిజన్ అందక ఇంకొందరు మరణిస్తున్నారు. అయితే , కరోనా సోకి , పెద్ద హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చి హాస్పిటల్ లో మరణిస్తే , వారికి చాలావరకు నగరంలోనే దహన సంస్కారాలు చేసి , ఉరికి వెళ్లి మిగిలిన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ..ఊర్లో కరోనా అంటే వణికిపోతుండటమే. చనిపోయారు కదా మళ్లీ ఇక్కడికి దేనికి అక్కడే కానిచ్చెయండి కొందరు చెప్తుంటే , ఊరికి తీసుకువెళ్లిన పాడే మోయడానికి నలుగురు కూడా వస్తారనే నమ్మకం లేదు. దానితో అక్కడే చివరి మజిలీ ముగించుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో సొంత గ్రామాలకి పయనమవుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎస్‌.లింగోటం గ్రామానికి చెందిన 60 ఏళ్ల వ్యక్తి కరోనా తో హైదరాబాద్‌ లోని చికిత్స పొందుతూకన్నుమూశారు. అంత్యక్రియలను ఊర్లో నిర్వహించాలా, నగరంలోనే జరపాలా, అని బంధువులు ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి రాలేక ,  బంధువులను, ఊర్లో పెద్ద మనుషులను సలహా కోరగా నగరంలో నిర్వహించడమే ఉత్తమం అని చెప్పడంతో  ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని నేరుగా హయత్‌నగర్‌ శ్మశాన వాటికకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా ఎన్నో ఘటనల్లో వివిధ ప్రాంతాలకు చెందిన రోగులకు చివరి మజిలీ హైదరాబాదే అవుతోంది. బంధుమిత్రుల కన్నీళ్ల నడుమ మృతులకు చివరి వీడ్కోలు పలికే పరిస్థితులు ఎప్పుడో పోయినా, మృతుల్లో చాలామందికి   కనీసం వారు పుట్టి పెరిగిన ఊర్లోనైనా అంత్యక్రియలు జరగట్లేదు. స్వస్థత పొందేందుకు నగరానికొస్తే, ప్రాణాలు పోయి ఇక్కడి మట్టిలోనే కలవాల్సి వస్తోంది.

వివిధ జిల్లాలకు చెందినవారే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగుల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు సాహసించడం లేదు. కొందరు ఆ ఆలోచన చేసినా వారి సంబంధీకులు వారిస్తున్నారు. దీంతో చివరి చూపు చూసి, నాలుగు కన్నీటి బొట్లు కార్చేసి, నగర శ్మశానవాటికల్లో ఎక్కడో ఓ చోట అంత్యక్రియలు జరిపించండంటూ దహన కార్యాలను జరిపించే సంస్థలకు మృతదేహాలను అప్పగించేస్తున్నారు.  సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రోగుల్లో సుమారు 30మంది వరకు మరణిస్తే వారి మృతదేహాలను స్థానికంగా అంత్యక్రియలు నిర్వహించే కాంట్రాక్టర్లకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకు చెల్లించి అప్పగించిన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మరణించిన తర్వాత ఆయా వార్డుల నుంచి కుటుంబీకులకు సిబ్బంది ఫోన్‌ చేసి చెబితే వారొచ్చి వచ్చి చివరి చూపు చూసుకొని వెళ్తున్నారు. సొంతూరికి తీసుకెళితే.. అంత్యక్రియల కోసం నలుగురు వెంట వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడే జరిపిస్తున్నారు.  కరోనా మృతుల సంఖ్య  రోజురోజుకి పెరుగుతుండటం, ఇక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో దహన క్రియల కోసం భారీగా వసూలు చేస్తున్నారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేందుకు అంబులెన్స్‌ల నిర్వాహకులు రూ.15వేల నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా, శ్మశానంలో చితి సిద్ధం చేసి, దహనం చేసేందుకు నిర్వాహకులు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. 
Tags:    

Similar News