ఆర్మూరు వ్యాపారి మాదిరే మీకూ కావొచ్చు..

Update: 2020-06-24 05:30 GMT
ఇప్పుడు నడుస్తున్నదంతా మహమ్మారి కాలం. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. నెలల తరబడి ఇంట్లో ఉండలేని పరిస్థితి. అలా అని బయటకు వచ్చినా.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ చిన్న తేడా జరిగినా.. తిప్పలు తప్పవు. అందుకే.. ఇంట్లో నుంచి రాలేక.. అలా అని బయట ఉండలేని సిత్రమైన పరిస్థితిని ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. కొందరు మాత్రం ఇందుకు మినహాయింపుగా చెప్పక తప్పదు.

ఇలాంటి వేళలో.. చిన్నపాటి దగ్గు.. కాస్త ఒళ్లు వెచ్చపడటం.. జలబు.. గొంతు నొప్పి.. ఇలా ఏ చిన్నసమస్య వచ్చినా కంగారు తప్పని పరిస్థితి. వెంటనే సవాలచ్చ అనుమానాలతో పాటు.. చుట్టూ ఉన్న వారి సలహాలతో హడలెత్తిపోయే పరిస్థితి. అదే సమయంలో మహమ్మారి మీద అవగాహన తక్కువగా ఉండటంతో నానా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

మాయదారి రోగానికి సంబంధించిన నిర్దారణ పరీక్షలు తెలంగాణలో చాలా తక్కువగా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఒక స్పష్టత చాలామందికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పరీక్ష చేయించుకొని.. దాని ఫలితం నెగిటివ్ వచ్చినంత మాత్రాన రేపు పాజిటివ్ రాదన్న గ్యారెంటీ ఏమీ ఉండదన్నది మర్చిపోకూడదు. ఎందుకంటే.. పరీక్షకు సేకరించే శాంపిల్ లో జరిగే చిన్న తప్పులు.. పొరపాట్లు కూడా ఫలితం మీద ప్రభావం చూపించే వీలుంది. ఇదే కాదు.. శాంపిల్ తీసే సమయానికి శరీరంలో ఉండే వైరల్ లోడ్ కూడా కీలకమన్నది మర్చిపోకూడదు.

ఇన్నింటి తర్వాత మాత్రమే.. పాజిటివ్ లేదంటే నెగిటివ్ అన్నది తేలుతుంది. ఆ విషయాన్ని మరిచిపోయి.. సందేహం వచ్చినంతనే పరీక్ష కోసం వెళ్లటం.. నెగిటివ్ రాగానే హ్యాపీగా ఫీల్ కావటం అంటే తప్పులో కాలేసినట్లే. తాజాగా అలాంటి తప్పే చేశారు ఆర్మూరుకు చెందిన వ్యాపారి ఒకరు. మూడు రోజుల క్రితం ఆయన చేయించుకున్న పరీక్షలో నెగిటివ్ వచ్చింది. అనంతరం ఇంట్లో వారి ఆరోగ్యంలో వచ్చిన తేడాతో వారితో పాటు ఆయన మళ్లీ చేయించుకున్నారు. ఈసారి ఇంట్లోని ఆయన తల్లికి.. కొడుక్కి.. తనకు పాజిటివ్ రావటంపై ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మూడు రోజుల్లోనే మారిపోతుందా? అని అమాయకంగా అడుగుతున్న ఆయన తీరు తరహాలోనే చాలామంది వ్యవహరిస్తుంటారు. మామూలుగా ఉన్నప్పుడు ఇదంతా పెద్ద విషయం కాదనిపించినా.. సమస్య మన ముంగిట్లోకి వచ్చినప్పుడు మాత్రం హడలిపోవటం ఖాయం. ఏతావాతా చెప్పేదేమంటే.. ఆర్మూరు వ్యాపారి లాంటి పరిస్థితే మనకూ ఎదురు కావొచ్చు. అలా అని కంగారు పడొద్దు. ఒకసారి టెస్టులో నెగిటివ్ వస్తే.. జీవితాంతం అదే నిజమన్నది సరికాదన్నదే చెప్పేది. మాయదారి రోగం పూర్తిగా మాయమయ్యే వరకూ ఈ మాత్రం అప్రమత్తం అవసరం. లేకుంటే టెన్షన్ లో పడిపోవటం ఖాయం.
Tags:    

Similar News