దాసరి హౌస్ అరెస్ట్

Update: 2016-02-08 07:01 GMT
    తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వస్తున్న కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావును రాజమండ్రిలో పోలీసులు నిర్బంధించారు. ఆయన కిర్లంపూడికి రావడానికి ఈ రోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలోని ఆనంద్ రీజన్సీ హోటల్‌లో ఉన్న ఆయన్ను బయటకు రాకుండా కాపలా ఉన్నారు.

నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరిన దాసరి వేకువన 4.30 గంటలకు రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ ఆనంద్ రీజెన్సీలో ఆయన విశ్రాంతి కోసం ఆగారు. అప్పటికే దాసరిని పలుచోట్ల అడ్డుకున్న పోలీసులు ఆయన ఆనంద్ రీజన్సీలో దిగిన తరువాత హోటల్ వద్ద భారీగా మోహరించారు. కిర్లంపూడికి దాసరి వెళ్తే అక్కడ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదముందన్న ఉద్దేశంతో ఆయన్ను వెళ్లకుండా ఆపాలని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాసరి హోటల్ నుంచి బయటకు రాగానే ఆయన్ను అదుపులోకి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

కాగా కిర్లంపూడి వెళ్లే క్రమంలో తమను అడ్డుకోవద్దంటూ ఇప్పటికే దాసరి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అయితే... ప్రభుత్వం నుంచి మాత్రం పోలీసులకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో ఆయన్ను వెళ్లనివ్వాలా ఆపాలా అన్నది తేల్చుకోలేక పోలీసులు అయోమయంలో ఉన్నారు. ఆయన వెళ్తే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తమవుతాయని మాత్రం అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన్ను ఆపడమే మంచిదని అనుకుంటున్నారు. మరోవైపు కిర్లంపూడిలో ముద్రగడ వైద్య పరీక్షలకు అంగీకరించకుండా ఇంట్లోనే తలుపులు బిడాయించుకుని దీక్ష చేస్తున్నారు.
Tags:    

Similar News