అంతా నా ఇష్టం అంటున్న అధికార పార్టీ

Update: 2015-06-22 07:27 GMT

ఉమ్మడి వ్యవహారం అన్నపుడు సమన్వయంతో ముందుకువెళ్లాల్సి ఉంటుంది. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నపుడు అండగా ఉండాలి. కానీ రాజకీయాల్లో అవేమీ ఉండవన్నట్లుగానే వ్యవహరిస్తోంది బీజేపీ పార్టీ. టీడీపీ-బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల నుంచి ఇప్పటివరకు పొత్తు బంధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న ఓ ఎన్నిక ఈ బంధానికి చీలిక తెచ్చే దిశగా కనిపిస్తోంది. 

వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి తెలంగాణ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎన్నికయిన అనంతరం ఎంపీ పదవికి కడియం రాజీనామా చేశారు. ఈ క్రమంలో త్వరలో వరంగల్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి సారించింది. టీడీపీతో కలిసి అనుకునేరు.. కానేకాదు! తమ పార్టీ అభ్యర్థే బరిలోకి దిగాలని డిసైడ్ అయిపోయింది. 

ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థినే బరిలోకి దించేందుకు ఇప్పటినుంచే బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వరంగల్‌ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎవరిని దింపితే బావుంటుందో చర్చించారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నికలో గెలిచి తీరాల్సిందేనని కమలనాథులు నిర్ణయించారు. ఇప్పటికే యాదగిరిగుట్ట-వరంగల్ హైవే అనుమతి ఇచ్చామని, వరంగల్‌లో త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయనున్నామని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్‌సభ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా కృషి చేయాలన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఎంపీగా బీజేపీ అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకుంటే మేలు జరుగుతుందని టీడీపీకి సర్దిచెప్పాలని బీజేపీ నేతలు భావిస్తున్నాట్లు సమాచారం. మొత్తంగా టీడీపీని మాట మాత్రం అయినా సంప్రదించకుండా....బీజేపీ సొంత నిర్ణయంతో ముందుకు వెళ్లడం పొత్తు బంధంపై ఏ సంకేతాలు ఇస్తుందో స్పష్టం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News