దావూద్ కే షాక్ ఇచ్చిన అనుచరుడు!

Update: 2016-09-12 04:24 GMT
తాడిని తన్నేవాడుంటే.. వాడి తలదన్నే వాడూ ఉంటాడంటారు! అచ్చూ అలాగే జరిగింది అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో. ఎంతో మందిని బెదిరించి, మరికోదరిని మోసం చేసి.. ఏది ఏమైనా ఎన్నో దారుణాలకు ఒడిగట్టి, ప్రస్తుతం అలాంటి వారందరికీ అడ్డాగా మారిన పాక్ లో తలదాచుకుంటున్న దావూద్ కి తగిలిన షాక్ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ - అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తన అనుచరుడి చేతిలో మోసపోయాడు. దావూద్ కి నమ్మకస్తుడైన ఖలీక్ అహ్మద్ అనే ఒక అనుచరుడు భారీ మొత్తంలో డాన్ డబ్బును దోచేశాడు.

వివరాళ్లోకి వెళితే.. దావూద్ భారత్ లో చేస్తున్న అక్రమ వ్యాపారాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్రమ ఆయుధాలు - వజ్రాలు - డ్రగ్స్ అక్రమ రవాణా లతోపాటు నల్లధనానికి సంబంధించిన పనులు కూడా నడుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ - ముంబై తదితర ప్రాంతాల నుంచి ఈ నల్లడబ్బును పెద్ద మొత్తంలో విదేశాలకు హవాలా ద్వారా తరలిస్తున్నాడు. ఇలా తరలించిన డబ్బును కొద్ది సంవత్సరాల తర్వాత మామూలుగా చలామణి చేయడానికి సహకరిస్తున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా.. అహ్మద్ ఢిల్లీలోని ఓ వ్యక్తి నుంచి రూ.45 కోట్ల రూపాయల నల్లధనాన్ని డాన్ తరఫున తీసుకోని హవాలా ద్వారా విదేశాలకు తరలించాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి నుంచి డబ్బును తీసుకుని.. సర్వీసు చార్జీ కింద దావూద్ కు రూ.5 కోట్లు మాత్రం పంపిన అహ్మద్ - మిగిలిన రూ.40 కోట్లతో విదేశాలకు చెక్కేశాడు. భారత నిఘా వర్గాలు కొన్ని అంతర్జాతీయ నెంబర్లను ట్యాప్ చేయగా ఈ వివరాలు బయటపడ్డాయి.

కాగా.. దావూద్ కి అత్యంత నమ్మకస్తులైన అనుచరుల్లో ఒకరిగా చెప్పుకునే ఈ అహ్మద్.. దావూద్ పనులమీద తరచూ భారత్ - షార్జాల మధ్య తిరుగుతుంటాడని తెలిసింది. ఇలా నమ్మకస్తుడైన అనుచరుడి హోదాలో అహ్మద్ చేసిన పనివల్ల డాన్ కు కలిగిన ఆర్థిక నష్టం కంటే.. అతని ప్రతిష్టకే ఎక్కువ భంగం కలుగుతుందని, దీనిపై దావూద్ చాలా సీరియస్ గా ఉన్నారని నిఘావర్గాలు ట్యాప్ చేసిన ఫోన్ కాల్ సారాంశం. ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న దావూద్.. అహ్మద్ ను పట్టుకోవడానికి నవంబర్ 26 - 2015న కొంతమంది అనుచరులను ఢిల్లీ నుంచి కెనడా పంపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇదే క్రమంలో ప్రస్తుతం అహ్మద్.. మణిపూర్ లో తలదాచుకుంటున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఏది ఏమైనా.. దావూద్ కు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం ఆశ్చర్యకరమైన మరి!!
Tags:    

Similar News