జగ్గారెడ్డి 15 లక్షలు తీసుకున్నారు: డీసీపీ

Update: 2018-09-11 11:20 GMT
మనుషుల అక్రమ రవాణాలో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పీకల్లోతు కూరుకుపోయిన సంగతి తెలిసిందే..  పక్కా ఆధారాలతోనే జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.  మంగళవారం డీసీపీ సుమతి ఈ మేరకు జగ్గారెడ్డి అరెస్ట్ , కేసు పూర్వపరాలను మీడియాకు వెల్లడించారు. జగ్గారెడ్డి తన ముగ్గురు కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా అమెరికాకు తరలించారని.. దీనికి వారి నుంచి రూ.15 లక్షలు తీసుకున్నారని తెలిపారు.  రాజకీయ కక్ష సాధింపుతోనే తాము జగ్గారెడ్డి అరెస్ట్ చేశారన్న ఆరోపణలను డీసీపీ ఖండించారు.

డీసీపీ సుమతి మాట్లాడుతూ.. ‘2004లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమంగా పాస్ పోర్టులు పొందారని.. ఎమ్మెల్యే  లెటర్ హెడ్ తో పాస్ పోర్టులు ఇప్పించారని తెలిపారు. ఈ నకిలీ పాస్ పోర్టులతో వీసాలు పొంది.. భార్య - కుమారుడు - కుమార్తె ఫొటోలు - పుట్టిన తేదీలు మార్పిడి చేశారని వివరించారు.  ఆధార్ డేటా ఆధారంగా ఈ అక్రమాలు గుర్తించినట్టు డీసీపీ తెలిపారు.

అమెరికాకు గుజరాత్ వ్యక్తులను పంపేందుకు జగ్గారెడ్డికి బ్రోకర్ మధు సహకరించాడని.. ఇలా చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు జగ్గారెడ్డి తీసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు.  జగ్గారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన వారి హస్తంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ సుమతి తెలిపారు.
Tags:    

Similar News