అయోధ్య వివాదం..కేవ‌లం ఆస్తి త‌గాదా!

Update: 2018-04-28 12:30 GMT
అయోధ్య‌లోని రామ మందిరం-బాబ్రీ మ‌స్జీదు స్థ‌ల వివాదంలో నేడు కీల‌క‌మైన ప‌రిణామం జ‌రిగింది. ఆ వివాదాన్ని కేవ‌లం స్థలానికి - ఆస్తికి సంబంధించిన వివాదంగా మాత్ర‌మే చూడాల‌ని సుప్రీం కోర్టుకు సీనియ‌ర్ న్యాయ‌వాది హ‌రీష్ సాల్వే విజ్ఞ‌ప్తి చేశారు. 1950లో ఈ కేసుకు సంబంధించి తొలి సివిల్ సూట్ ను స‌మ‌ర్పించిన గోపాల్ సింగ్ విశార‌ద్ త‌ర‌ఫున వాదిస్తోన్న హ‌రీష్ సాల్వే.....ఈ విష‌యాన్ని దేశంలోని అత్యున్న‌త న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. ఈ వివాదాన్నిమ‌త‌ప‌ర‌మైన‌ - రాజ‌కీయ‌ప‌ర‌మైన అంశంగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌కారం ఈ కేసును ప్ర‌స్తుతం విచార‌ణ చేస్తోన్న త్రిస‌భ్య బెంచ్ వద్దే ఉంచాల‌ని - వేరే బెంచ్ కు త‌ర‌లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న‌....చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా - జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ - ఎస్. అబ్దుల్ న‌జీర్ ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.  

గ‌తంలో కూడా ఏదైనా హైకోర్టు ఫుల్ బెంచ్ జారీ ఆదేశాల‌కు స‌వాలు చేస్తూ సుప్రీంకు విచార‌ణ నిమిత్తం వ‌చ్చిన కేసుల‌ను త్రిస‌భ్య బెంచ్ విచార‌ణ చేప‌ట్టింద‌ని హ‌రీష్ సాల్వి గుర్తు చేశారు. హ‌రీష్ వాద‌న‌ల‌తో `రామ్ ల‌ల్లా విరాజ్ మాన్` త‌ర‌ఫు వాదిస్తోన్న సీనియ‌ర్ న్యాయ‌వాది కె.ప‌ర‌సురాం ఏకీభ‌వించారు. ఈ కేసుకు సంబంధించిన సున్నిత‌మైన అంశాల‌ను - దానికున్న ప్రాముఖ్య‌త‌ను సుప్రీం ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని పిటిష‌న‌ర్ ఎం.సిద్ధిక్ - ముస్లిం సంస్థ‌ల త‌ర‌ఫున వాదిస్తోన్న సీనియ‌ర్ న్యాయ‌వాది రాజు రామ‌చంద్ర‌న్ కోరారు. ఆ కార‌ణాల వ‌ల్ల ఈ కేసును త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం క‌న్నా ఎక్కువ మంది స‌భ్యులున్న బెంచ్ కు త‌ర‌లించాల‌ని కోరారు. అయితే, ఈ వాద‌న‌ల‌ను విన్న సుప్రీం కోర్టు....త‌దుపరి విచార‌ణ‌ను మే 15కు వాయిదా వేసింది. కాగా, 2010లో అల‌హాబాద్ హైకోర్టులోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం....2:1 మెజారిటీ రూలింగ్ తో ఆ వివాదాస్ప‌ద స్థలాన్ని 3 స‌మాన భాగాలుగా పంచుకోవాలని తీర్పునిచ్చింది. సున్ని వ‌క్ఫ్ బోర్డు - నిర్మోహి అఖారా - రామ్ ల‌ల్లా లు స‌మానంగా పంచుకోవాల‌ని తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ వారు సుప్రీంను ఆశ్ర‌యించారు.
Tags:    

Similar News