చిన్నమ్మతో తలపడేందుకు దీప రెఢీ

Update: 2017-02-01 05:25 GMT
ఆచితూచి అడుగులు వేస్తూ.. ఎక్కడా తన పట్ల వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేలా చేయటంలో తమిళనాడు చిన్నమ్మ శశికళ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొందరపాటుతో వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఆమె.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తనకు ఆరాటం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. సీఎం కుర్చీలో కూర్చునేందుకు చిన్నమ్మ తపించినట్లుగా వార్తలు వచ్చినా.. ఆమె అట్టే తొందరపాటుతో వ్యవహరించటం లేదన్న వైనం తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. చిన్నమ్మకు చిరాగ్గా మారిన అమ్మ మేనకోడలు దీప.. తాజాగా మరోసారి తనదైన రీతిలో వ్యవహరించారని చెప్పాలి. అమ్మకు అసలుసిసలు వారసురాలు తానేనని చెప్పుకునే దీప.. కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తనను అభిమానిస్తున్న నేతలు.. అభిమానగణంతో చర్చలు జరిపిన ఆమె.. పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఆసక్తికర నిర్ణయాన్న వెల్లడించారు. అమ్మ ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ లో పర్యటించిన దీప.. అక్కడి ప్రజలతో కలిసి భేటీ అయ్యారు. పర్యటన అనంతరం ఆమె మాట్లాడుతూ.. త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో తాను ఆర్కేనగర్ నుంచి బరిలోకి దిగనున్నట్లుగా వెల్లడించారు. అమ్మకు తానే అసలు వారసురాలినని చెబుతున్న దీప.. ఆర్కే నగర్ తన సొంత నియోజకవర్గంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రజలు తనను ఇక్కడి నుంచే పోటీ చేయాలని కోరుతున్నారని.. వారి ఆకాంక్షను నెరవేర్చటం తన విధిగా ఆమె చెబుతున్నారు. శశికళ కానీ పోటీ చేస్తే ఆమెను ఓడిస్తానని వెల్లడించారు.

ఆర్కే నగర్ నుంచి ఎలా పోటీ చేస్తారని దీపను ఎవరైనా ప్రశ్నిస్తే.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆమె.. నాలుగు గోడల మధ్య కూర్చొని బరిలో నిలవాలో లేదోనన్న నిర్ణయాన్ని తీసుకోవటం సరికాదంటూ చిన్నమ్మకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా దీప వ్యాఖ్యలు చేస్తున్నారు. చిన్నమ్మకు పోటీగా దీప కాని బరిలోకి దిగితే.. ఇక ఆ పోటీ ఎంత ఆసక్తికరంగా మారుతుందో మాటల్లో చెప్పలేని పరిస్థితి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News