ఇదేం పోయే కాలం? కాణిపాకం అర్చకుడి ఇంట్లో జింక చర్మం

Update: 2023-04-09 10:45 GMT
ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి అనుబంధంగా ఉండే ఆలయమైన వరదరాజులస్వామి ఆలయంలో అర్చకుడిగా పని చేసే క్రిష్ణమోహన్ అసలు రంగు బయటకు వచ్చింది.

అతడి ఇంట్లో తాజాగా సోదాలు నిర్వహించిన అధికారులకు జింక చర్మం లభించిన వైనం షాకింగ్ గా మారింది. గుళ్లో అర్చకుడిగా వ్యవహరిస్తూ.. ఇలా చట్టవిరుద్ధమైన పనులు చేయటం ఏమిటి? అన్నది షాకింగ్ గా మారింది.

తాను ఒక వ్యక్తి ద్వారా జింకచర్మాన్ని కొన్న విషయాన్ని అర్చకుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. జింక చర్మాన్ని అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాణిపాకం వినాయకస్వామి దేవాలయంలో పని చేసే సిబ్బంది ఆరాచకాలను ఆలయ ఈవోగా వ్యవహరిస్తున్న వెంకటేశం.. రహస్యంగా పరిశోధన చేసి వారి లీలల్ని బట్టబయలు చేశారు.

ఆలయంలోని అన్నదానం.. గిడ్డండి.. పోటులో పని చేసే సిబ్బంది.. నిత్యవసర వస్తువుల్ని భారీగా తమ ఇళ్లకు తరలించేసి.. లక్షలు దండుకున్న వైనాన్ని గుర్తించారు. తాజాగా దాడులు నిర్వహించిన సమయంలో నలుగురు వంట మనుషుల ఇళ్లల్లో పెద్ద ఎత్తున బియ్యం బస్తాలు.. ఇతర సరుకుల్ని గుర్తించారు.

నిత్యం 2500 మందికి అన్నదానానికి అవసరమైన సామాగ్రిని తీసుకెళ్లే సిబ్బంది.. అందులో కొంత భాగాన్నితమ ఇళ్లకు తరలిస్తున్న గుట్టురట్టైంది. కొందరి సిబ్బంది ఇళ్లల్లో దొరికిన వస్తువుల విలువ రూ.1.3 లక్షలు ఉంటే.. ఇంతకాలం చేసిన ఈ దొంగ పనికి మరెంత విలువైన వస్తువులు పక్కదారి పట్టాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేవుడి సొమ్మును దోచుకుంటున్న ఈ తీరు షాకింగ్ గా మారింది.

Similar News