మోడీపై ఆ సీఎం చుర‌క అదిరింది!

Update: 2019-04-30 06:21 GMT
ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ చేసే వ్యాఖ్య‌లు సూటిగా ఉంటాయి. ప‌రిస్థితికి త‌గ్గ‌ట్లుగా మాట్లాడ‌టంలో ఆయ‌న దిట్ట‌. ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేయాలంటే మ‌హ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ప‌లు సంద‌ర్భాల్లో ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

మోడీ వ్య‌తిరేకుల మ‌న‌సుల్ని దోచేలా ఉండే కేజ్రీవాల్ వ్యాఖ్య‌ల జాబితాలో మ‌రొక‌టి చేరింది. వార‌ణాసి నుంచి పోటీ చేస్తున్న ప్ర‌ధాని మోడీపైన స‌మాజ్ వాదీ పార్టీ త‌న అభ్య‌ర్థిగా మాజీ బీఎస్ఎఫ్ పోలీసును దింపిన వైనం వాతావ‌ర‌ణాన్ని వేడెక్కేలా చేసింది. వార‌ణాసి బ‌రిలో మోడీ మీద పోటీ చేసే అభ్య‌ర్థుల్లో అస‌లుసిస‌లు అభ్య‌ర్థిగా తేజ్ బ‌హ‌దూర్ ను చెప్పాలి.

స‌రిహ‌ద్దుల్లో భ‌ద్ర‌త చేప‌ట్టే సిబ్బందికి పెట్టే భోజ‌నం ఎంత నాసిరకంగా ఉంటుందన్న విష‌యాన్ని ప్ర‌పంచానికి త‌న వీడియోతో చెప్పి.. సంచ‌ల‌నం సృష్టించిన అత‌గాడు.. బాధ్య‌తారాహిత్యంతో విధులు నిర్వ‌ర్తిస్తున్నారంటూ ఉద్యోగం పీకి పారేయ‌టం తెలిసిందే.

నోరు తెరిస్తే నీతులు చెప్ప‌ట‌మే కాదు.. దేశానికి కాప‌లాకాసే వ్య‌క్తిగా త‌ర‌చూ చెప్పుకునే మోడీ.. మ‌రీ రియ‌ల్ చౌకీదార్ ను ఎందుకు కాపాడ‌లేదు? అత‌గాడి అవినీతి వ్య‌తిరేక పోరాటానికి ఎందుకు ద‌న్నుగా నిల‌వ‌లేద‌న్న విష‌యానికి స‌మాధానం వినిపించ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. తేజ్ బ‌హ‌దూర్ లేవ‌నెత్తిన అంశాన్ని మోడీ ప్ర‌స్తావించిందే లేదు. దేశ ర‌క్ష‌ణ‌లో కీల‌క‌భూమిక పోషించే వారికి  క‌డుపు నిండా చ‌క్క‌టి భోజ‌నాన్ని పెట్ట‌లేని వ్య‌వ‌స్థ‌లో కీల‌క‌మైన స్థానంలో ఉన్న వ్య‌క్తి మీద నేరుగా పోటీకి దిగ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎస్పీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన తేజ్ బ‌హ‌దూర్ ను ఉద్దేశించి ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్య ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కూ ఆయ‌న ఏమ‌న్నారంటే.. ఒక‌వైపు సైన్యంలో ప్రాణాల‌కు తెగించి కాప‌లా కాస్తూనే.. సైనికుల హ‌క్కుల కోసం పోరాడిన యోధుడు తేజ్ బ‌హ‌దూర్. మ‌రోవైపు సైనికుల హ‌క్కుల కోసం ప్ర‌శ్నించిన వ్య‌క్తిని ఆ సైన్యానికి దూరం చేసి.. మ‌ళ్లీ ఆ సైనికుల పేరు మీదే ఓట్లు అడిగే అవ‌కాశ‌వాది మోడీ. వీరిద్ద‌రిలో ఎవ‌రికి ఓటు వేస్తారో ప్ర‌జ‌లే తేల్చుకోవాలంటూ వార‌ణాసి ప్ర‌జ‌ల‌కు వ‌దిలేశారు కేజ్రీవాల్. మ‌రి.. ఆయ‌న మాట‌లు అక్క‌డి ఓట‌ర్ల మీద ఎంత ప్ర‌భావాన్ని చూపిస్తాయో చూడాలి. 
Tags:    

Similar News