బ్యాంకులు ఇలాంటి షాకులు కూడా ఇస్తాయా?

Update: 2017-04-14 10:56 GMT
బ్యాంకుల విష‌యంలో సామాన్యుల‌పై అప‌నమ్మ‌కం క‌లిగే మ‌రో వార్త ఇది. కోటి మంది భార‌తీయుల‌కు చెందిన బ్యాంకు అకౌంట్ల వివ‌రాలు ఆ ఒక్క‌డి ద‌గ్గ‌రే ఉన్నాయి. అత‌ని పేరు పూర‌న్ గుప్తా. వ‌యసు 33 ఏళ్లు. ఇత‌న్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అకౌంట్ల వివ‌రాల‌ను అత‌ను న‌కిలీ కాల్ సెంట‌ర్ల‌కు అమ్ముతున్నాడు. ఒక్కో అకౌంట్‌ ను ప‌ది పైస‌లకు అత‌ను అమ్ముకున్న‌ట్లు గుర్తించారు. ఇత‌ని వ‌ల్ల డెబిట్‌ - క్రెడిట్ కార్డ్ వివ‌రాల‌ను తెలుసుకుంటున్న కాల్‌ సెంట‌ర్ల వాళ్లు.. బాధితుల‌కు ఫోన్ చేసి వ‌న్‌ టైమ్ పాస్‌ వ‌ర్డ్‌ ను కూడా తీసుకొని డ‌బ్బు చోరీ చేస్తున్నారు.

ఢిల్లీలోని గ‌ణేష్ న‌గ‌ర్‌ లో సోమ‌వారం పూర‌న్ గుప్తాను అరెస్ట్ చేశారు. గ్రేట‌ర్ కైలాష్‌ లోని ఓ వృద్ధునికి సిటీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామ‌ని చెబుతూ.. ఓటీపీ తెలుసుకొని రూ.1.46 ల‌క్ష‌లు కాజేశారు. ఆయ‌న ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు.. గుప్తాను అరెస్ట్ చేశారు. బాధితుడు వెంట‌నే ఫిర్యాదు చేయ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ-వాలెట్ సంస్థ‌ల‌తో మాట్లాడి నేరం గుట్టు విప్పారు. ఈ కాజేసిన మొత్తంలో చాలా వ‌ర‌కు ఈ-వాలెట్స్‌ కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ రోమిల్ బానియా తెలిపారు. ఈ మొత్తంలో అప్ప‌టిక‌ప్పుడు ఆయా ఈ-వాలెట్ సంస్థ‌లు రూ.72 వేల వ‌ర‌కు తిరిగి ఇచ్చేసిన‌ట్లు బానియా వెల్ల‌డించారు.

ఈ మ‌ధ్యే ఓ న‌కిలీ కాల్‌ సెంట‌ర్ ఓన‌ర్ ఆశిష్‌ కుమార్‌ ను అరెస్ట్ చేయ‌గా.. అత‌ను కూడా గుప్తా వ‌ల్లే త‌న‌కు అకౌంట్ల వివ‌రాలు తెలిశాయ‌ని చెప్పాడు. వెంట‌నే గుప్తా కోసం వేట మొద‌లుపెట్టి అత‌న్ని అరెస్ట్ చేయ‌గ‌లిగారు. అత‌ని వ్య‌క్తిగ‌త ల్యాప్‌ టాప్‌ ను శోధించ‌గా.. కోటి మంది భార‌తీయుల అకౌంట్ల వివ‌రాలు అత‌ని ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఖాతాదారుల వివ‌రాల‌ను కూడా త‌న క్లైంట్ల‌కు కావాల్సిన విధంగా దాచి పెట్ట‌డంతో కాల్‌ సెంట‌ర్ల య‌జ‌మానులు.. మ‌హిళ‌లు - వృద్ధులు ల‌క్ష్యంగా చేసుకొని దోపిడీ చేయ‌డం సులువైంది. బ్యాంకుల్లోని ఉద్యోగులే గుప్తాకు ఈ వివ‌రాలు ఇచ్చార‌న్న కోణంలోనూ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News