మోడీ సలహాదారు మళ్లీ అప్ సెట్ అయ్యారు!

Update: 2016-11-28 07:11 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు స‌ల‌హా ఇచ్చిన అర్థక్రాంతి వ్యవస్థాపకుడు అనిల్‌ బొకిల్ మ‌రోమారు కేంద్రం నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సరైన సన్నాహాలు లేకుండానే కేంద్రం పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నదని  వ్యాఖ్యానించారు. ఠాణెలో జరిగిన నరేంద్రబల్లాల్ స్మారకోపన్యాసంలో మాట్లాడుతూ తాము ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించడం లేదని అన్నారు. అలా అని ర‌ద్దుకు వ్యతిరేకం కాదని చెప్పారు. రూ. 50 కంటే తక్కువ విలువ గల నగదును అందుబాటులోకి తెస్తే ఇంత స‌మ‌స్య ఉండేది కాద‌ని అనిల్ బొకిల్ చెప్పారు.

ఇదిలాఉండ‌గా... తాను కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉంటే ప్రధానమంత్రికి నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సలహా ఇచ్చేవాడినని మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  చిదంబరం పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఈ నిర్ణయాన్ని అమలు చేయాల్సిందే అని ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేసేవాడినని తెలిపారు. 45 కోట్ల మంది సాధారణ ప్రజలకు నిత్యావసరాలను దూరం చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. ప్రజలు అడుక్కోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి కారణమైన నిర్ణయం అనైతికమైందని పేర్కొన్నారు.

కాగా...పెద్ద నోట్ల రద్దు అమలులోకి వచ్చి 19 రోజులైనా సరిపడా నగదు లభించక సామాన్యులు అష్టకషాలు పడుతున్నారు. ఆదివారం సెలవు కావడం వల్ల బ్యాంకులు పనిచేయలేదు. ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలోని కొన్ని ఏటీఎంలు మాత్రమే తెరుచుకున్నా వాటిల్లో నగదు సరిపడా నిల్వలు లేక మూతపడటంతో ప్రజలు వట్టిచేతులతోనే ఇళ్ల‌కు వెళ్లిపోయారు. రద్దయిన నోట్ల స్థానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కేంద్రం - ఆర్బీఐ - బ్యాంకులు విఫలమయ్యాయి. కొత్త రూ.2000 నోట్లతో లావాదేవీలు జరిపేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ చిన్న నోట్లు భారీగా అందుబాటులో లేకపోవడం స‌మ‌స్య‌గా  మారింది. రద్దయిన నోట్ల విలువ రూ.14.18 లక్షల కోట్లని క్రెడిట్ సూయిజ్ అనే రీసెర్చ్ సంస్థ అంచనా. కానీ ఇప్పటి వరకు కేవలం 1.5 లక్షల కోట్ల నగదు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

పాత నోట్ల స్థాయిలో పూర్తిస్థాయిలో నగదు నిల్వలు అందుబాటులోకి తేవడానికి ఆర్బీఐకి కొన్ని నెలలు పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆర్బీఐకి ప్రస్తుత డిమాండ్‌ ను అందుకోవాలంటే 150 కోట్ల రూ.2000 నోట్లు ముద్రించగల సామర్థ్యం కావాలని క్రెడిట్ సూయిజ్ పేర్కొంది. అలాగే నూతన రూ.500 నోట్లు 1000 నుంచి 2000 కోట్లు ముద్రిస్తే గానీ సాధారణ పరిస్థితి నెలకొనదని తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నిర్వహించిన మరో సర్వే ప్రకారం ఆర్బీఐ ప్రస్తుతం 150 శాతం సామర్థ్యంతో కొత్త నోట్లు ముద్రించగలిగితే జనవరిలోగా సాధారణ పరిస్థితులు నెలకొల్పగలదని, లేదంటే కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపింది. నగదు ఉపసంహరణలు - ఏటీఎంల నుంచి ఎక్కువ మొత్తంలో విత్‌ డ్రాయల్స్‌ కు ప్రభుత్వం అనుమతించిన మరుక్షణం నగదు కోసం డిమాండ్ పెరుగుతుందని, అందుకు అనుగుణంగా అధిక స్థాయిలో నోట్లు సిద్ధంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. నగదు కొరతతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, స్వల్పకాలిక - మధ్యకాలికంగా వినియోగదారుల డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని, జీడీపీ వృద్ధిరేటు నాలుగు పాయింట్లు తగ్గే అవకాశమున్నదని ఆ సర్వే పేర్కొంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News