సమ్మెతో భార్య జాబ్ పోతుందన్న బెంగతో భర్త మృతి

Update: 2019-10-10 05:32 GMT
ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కారణంగా ఇప్పటికే ఆయా ఉద్యోగుల కుటుంబాలు తీవ్రమైన ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే గడిచిన నెల తాలూకు అందాల్సిన జీతం చేతికి రాకపోవటంతో ఇబ్బందులకు గురి అవుతున్నాయి ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉద్యోగి అయినా.. అతనెంత స్థాయిలో ఉన్నా నెలసరి జీతం రాకుండా ఆగితే ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.

నెల గడిచినంతనే కట్టాల్సిన ఈఎంఐ చిక్కుల్లో చిక్కుకొని ఉండటం ఒక కారణంగా చెప్పాలి. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్.. సమ్మెను నీరు కార్చే పనిలో భాగంగా జీతాల్ని ఆపేసి ఉద్యోగుల్ని ఒత్తిడికి గురి చేశారని చెప్పాలి. ఇందుకు తగ్గట్లే.. జీతాలు రాక ఉద్యోగులు తీవ్రఒత్తిళ్లకు గురి అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సమ్మె చేస్తున్న 48వేల ఉద్యోగాల్ని తీసేసినట్లుగా కేసీఆర్ చెప్పటం తెలిసిందే.

ఈ ప్రకటనతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలకు గురి కావటమే కాదు.. వారి కుటుంబాలు తీవ్రమైన మనోవ్యధకు గురి అవుతున్నాయి. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వు బయటకు రాకున్నా.. సమ్మె చేస్తున్న ఉద్యోగులంతా తమ ఉద్యోగాల్ని కోల్పోయినట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించటం తెలిసిందే. దీంతో.. తమ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న బెంగ వారిలో అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తగ్గట్లే కొన్ని విషాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

ఆర్టీసీలో పని చేస్తున్న తన భార్య ఉద్యోగం పోతుందన్న బెంగతో ఒక భర్త గుండెపోటుతో మృతి చెందిన విషాదం సంగారెడ్డిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణంలోని బాబానగర్ లో 39 ఏళ్ల కర్నె కిశోర్ కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఆయన సతీమణి నాగరాణి ఆర్టీసీలో జాబ్ చేస్తోంది. ఐదు రోజులుగా సాగుతున్న సమ్మె నేపథ్యంలో.. సమ్మె చేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో భర్త కిశోర్ మనస్తాపానికి గురయ్యారు.

ఈ బెంగ అంతకంతకూ పెరగటం.. భార్య ఉద్యోగం పోతే బతకటం కష్టంగా మారుతుందన్న భయాందోళనలకు గురయ్యాడు. ఈ క్రమంలో గడిచిన రెండు రోజులుగా సరిగా భోజనం చేయటం లేదు. ఈ నేపథ్యంలో అస్వస్థతకు గురై.. నిద్రలోనే గుండెపోటుు గురైన మృతి చెందినట్లుగా ఆయన కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  వీరికి రెండేళ్ల పాప ఉంది. తన భర్త మరణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలే కారణమని నాగరాణి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News