ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న చిట్టి వీడియో.. ఏడారి దేశంలో ఇలానా?

Update: 2022-07-30 05:30 GMT
మీరిప్పుడు చూసిన వీడియో ఎక్కడిది? అన్నంతనే ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పొచ్చు. కానీ.. ఈ వీడియో అక్షరాల యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు చెందింది అంటే మాత్రం ఒక పట్టాన నమ్మరు. కానీ.. ఇది నిజం. ప్రపంచమే నివ్వెర పోయేలా.. ఏడారి దేశంలో వరదలు పోటెత్తుతున్నాయి. వరద ప్రవాహానికి వందలాది మంది ప్రజలు విలవిలలాడుతున్నారు.

క్రమబద్ధంగా ఉంటుందని చెప్పే ఆ దేశంలో విరుచుకుపడిన వరదలతో కార్లు పేపర్ పడవల్లా తేలిపోయాయి. ఇక.. పలు భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. రోడ్లు మొత్తం జలమయం కావటమే కాదు.. ఇళ్లు.. షాపులు నీట మునిగిన పరిస్థితి. మొత్తంగా యావత్ ప్రపంచమే అవాక్కు అయ్యేలా యూఏఈలో వరదల ఎపిసోడ్ నడుస్తోంది.

ఎప్పుడూ లేని అకాల వర్షాలతో చోటు చేసుకున్న వరద.. వీధుల్ని పోటెత్తిస్తోంది. రాతి ఏడారి ప్రాంతంగా పేరున్న పుజైరా.. షార్జా నగరాలు భారీ వర్షాలతో ఆకస్మిక వరదలకు కారణమైంది. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా.. పెద్ద ఎత్తున వాహనాలు నీట మునిగాయి. ఇక.. షాపుల సంగతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

కొన్ని చిన్న భవనాలు అయితే.. వరద తాకిడికి ధ్వంసమవుతున్నాయి. గడిచిన 27 ఏళ్లలో ఎప్పుడూ లేనంత భారీ వర్షం కురిసినట్లుగా అధికారులు చెబుతున్నారు.

వరదల తీవ్రత నేపథ్యంలో కష్టాల్లో పడిన ప్రజల్ని కాపాడటానికి వీలుగా సైన్యం రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకుపోయిన వందలాది మందిని వారు కాపాడి.. పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండు రోజులుగా పుజైరాలో కురిసిన వర్షం అత్యధికమని చెబుతున్నారు. జాతీయ వాతావరణ కేంద్రం లెక్కల ప్రకారం రెండురోజుల్లో పుజైరాలో కురిసిన వర్షం ఏకంగా 25.5 సెంటీమీటర్లుగా చెబుతున్నారు. ఎమిరేట్ ఆఫ్ పుజైరా అన్నంతనే.. యూఏఈతో ఏ మాత్రం అవగాహన ఉన్న వారైనా సరే.. అక్కడి రాతి నేలలు.. మైదాన ప్రాంతాలతో కలిసి ఉండే పట్టణం కళ్ల ముందు కదలాడుతుంది.

అలాంటి ఫుజైరాలో ఇప్పుడు సీన్ మొత్తం మారింది. ఎటు చూసినా నీళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పుజైరాలో 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. దీనికి సమీపంలోని మసాఫీ గ్రామంలో 20.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక.. పుజైరా ఎయిర్ పోర్టు సమీపంలో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

భారీ వర్షాలతో పర్వత ప్రాంతానికి దిగువున ఉన్న ఊళ్లు జలమయం కావటం గమనార్హం. వరద తీవ్రతను కళ్లకు కట్టినట్లుగా కనిపించే వీడియోలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఏడారి దేశంలో అరుదుగా చోటు చేసుకునే వరదలు.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్ని.. పర్యావరణ విపరిణామాల్ని చెప్పకనే చెప్పేస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఏడారి దేశంలో వెల్లువెత్తిన వరద.. ప్రపంచానికి షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు.

For Video >> https://youtube.com/shorts/mIrnYf_b6FY?feature=share
Tags:    

Similar News