దేశపతి మాట మీడియాలో.. ఆయన ప్రస్తావించారంటే జంపేనా?

Update: 2021-12-03 03:14 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కలు ఒక పట్టాన అర్థం కావు. ఒకరికి అమితంగా ప్రాధాన్యతను ఇవ్వటం.. అంతలోనే వారిని కూరలో కరివేపాకులా వాడేయటం ఆయనకు మాత్రమే చెల్లుతుంది. చంకన ఎక్కించుకున్నా.. దగ్గరకు రానివ్వకుండా దూరంగా పెట్టినా.. సదరు నేత నోటి నుంచి మాట రాకుండా చేయటంలో ఆయనకున్న నైపుణ్యం అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమంలో తరచూ వినిపించిన పేర్లలో ఒకటి దేశపతి శ్రీనివాస్. తన రాతలతో తెలంగాణ సమాజాన్ని కదిలించిన ఆయన్ను.. ప్రత్యేక రాష్ట్రంలో తన పేషీలోనే ఉంచుకున్నారు కేసీఆర్.

ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న మాట ఇప్పటిది కాదు. ఏళ్లకు ఏళ్లుగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఆయన పేరు తెర మీదకు రావటం.. ఆయనకు ఆ అవకాశం దక్కకుండా పోవటం తెలిసిందే. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దేశపతికి మొండిచేయే లభించింది. ఆ మధ్య వరకు కూడా మీడియాలో తరచూ దర్శనమిచ్చే దేశపతి.. గడిచిన కొంతకాలంగా మీడియాలో అస్సలు కనిపించటం లేదు. ఆ మాటకు వస్తే.. ఆయన మాట కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి.

ఇలాంటివేళ.. తాజాగా టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన కమలం పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు పదవులు దక్కట్లేదన్న ఆయన.. ఉద్యమకారులంతా బీజేపీలోకి రావాలంటూ పిలుపునిచ్చారు. పనిలో పనిగా.. దేశపతి కూడా కమలం పార్టీలో చేరాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.

కేసీఆర్ తీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని విఠల్ చెబుతూ.. ‘సీఎం కేసీఆర్ నుంచి పిలుపు కోసం ఏడాది కాలంగా ఎదురు చూశా. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిన మాట వాస్తవం. కానీ.. ప్రతిపక్ష పాత్రలో ఆ పార్టీ విఫలమైంది. అందుకే.. ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు.

బీజేపీలో మాత్రమే ఆత్మగౌరవం దక్కుతోందని నమ్ముతున్నా’ అని వ్యాఖ్యానించిన ఆయన.. దేశపతిని కమలం పార్టీలోకి రావాలని కోరుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ.. ఈటల విజయాన్ని అడ్డుకోవటంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ జోరందుకుందని చెబుతున్నారు. మరి.. విఠల్ కోరుకున్నట్లుగా దేశ పతి కమలం పార్టీలోకి వస్తారా? లేదా? అన్నది చూడాలి.
Tags:    

Similar News