డెస్టినేషన్ వెడ్డింగ్ వినే ఉంటారు..తెలంగాణలో ఇప్పుడు డెస్టినేషన్ పాలిటిక్స్!

Update: 2022-08-09 10:39 GMT
సంపన్నులు.. అల్ట్రా రిచ్ అయిన పెద్ద కుటుంబాల వారు తమ పెళ్లిళ్లను సదూరంగా ఉన్న ప్రాంతాల్లో తాము అనుకున్న థీమ్ కు తగ్గట్లుగా సెట్ చేసుకొని పెళ్లి చేసుకోవటం ఇప్పటివరకు విని ఉంటారు. దీనికి భిన్నంగా తెలంగాణలోని రాజకీయం రాష్ట్రాన్ని దాటి సదూర తీరాన ఉన్న ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ లో సరికొత్త రాజకీయానికి వేదికగా మారుతోందట.

దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోవటమే కాదు.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తెలంగాణలో కమలవికాసాన్ని ఇంతకు ముందెప్పుడు తీసుకోనంత సీరియస్ గా తీసుకోవటంతో కొత్త సమీకరణాలకు తెర తీస్తోంది.

అయితే.. తెలంగాణ రాష్ట్రంలో ఉండి మాట్లాడుకోవటం సాధ్యం కాదన్న నిర్ణయానికి పలువురు నేతలు వచ్చినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో గోడలకు చెవులుంటాయని.. చిన్న శబ్దాన్ని సైతం ఎక్కడో ప్రగతిభవన్ లోనూ.. ఫార్మర్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు రీసౌండ్ మాదిరి వినిపిస్తుందన్న భయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తుంటారు.

గతంలో మామూలు ఫోన్లో మాట్లాడుకోవటానికి వెనుకాడే పలువురు ప్రముఖులు వాట్సాప్.. టెలిగ్రామ్ లో మాట్లాడుకోవటం షురూ చేశారు. అయితే.. అవేమీ సేఫ్ కావని.. తమ నోటి నుంచి వచ్చే మాటల్ని ఎప్పటికప్పుడు వినేంత సౌకర్యం గులాబీ బాస్ కు ఉందన్న భయాన్ని ఈ మధ్యన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే.. డెస్టినేషన్ వెడ్డింగ్ మాదిరి.. ఏదో ఒక డెస్టినేషన్ కు వెళ్లి మాట్లాడుకోవటం మంచిదన్నట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజాగా రాష్ట్రానికి చెందిన ఒక మాజీ ఎంపీ కుమార్తెకు.. మరో మాజీ ఎంపీ మనవడితో ఈ నెలలో పెళ్లి జరగనుంది. ఈ రెండు కుటుంబాల వారి కోరిక మీద డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నారు. పెళ్లిని ఇండోనేషియాలోని బాలిలో చేపట్టేందుకు డిసైడ్ చేశారు. ఈ మేరకు రెండు కుటుంబాలకు చెందిన పరిమిత అతిధులతో పాటు.. ప్రత్యేక విమానాలు.. అదిరే ఏర్పాట్లతో ప్లాన్ చేస్తున్నారు.

ఈ పెళ్లికి బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వెళుతుండటం.. ఇదే పెళ్లికి టీఆర్ఎస్.. కాంగ్రెస్ కు చెందిన నేతలు వెళుతున్న నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణకు బాలిలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో నిరంతరం నిఘా ఉన్న వేళ.. విదేశాల్లో అయితే స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చన్న ఆలోచనతోనే ఈ అరేంజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ డెస్టినేషన్ పాలిటిక్స్ గురించి సీఎం కేసీఆర్ కు తెలిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ డెస్టినేషన్ పాలిటిక్స్ కు సంబంధించిన వివరాలు మీడియాలో లీకైన వేళ.. ఇప్పుడీ వెడ్డింగ్ కు అధికార పార్టీ నేతలు వెళ్లే సాహసం చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News