మాస్టార్ మాటలకు అర్ధాలు వేరేనా... ?

Update: 2021-11-07 07:37 GMT
విశాఖ జిల్లా వైసీపీలో సీనియర్ మోస్ట్ నేతగా దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయన పొలిటికల్ హిస్టరీ కూడా చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. నాటకలు రాసుకుంటూ హిందీ మాస్టర్ గా అనకాపల్లిలో పనిచేస్తున్న దాడిని రాజకీయాల్లోకి స్వయంగా ఆహ్వానించింది ఎన్టీయార్. ఆయనకు 1985లో టికెట్ ఇస్తే ఆయన ఏకంగా ఆరు సార్లు ఓటమి లేకుండా గెలిచి నిలిచిన వీరుడుగా పేరు తెచ్చుకున్నారు. అంతే కాదు కీలకమైన సమాచార శాఖతో పాటు ఇతర శాఖలను మంత్రిగా చూశారు. ఆయన  ఎన్టీయార్ జమానాలో ఒక వెలుగు వెలిగారు. పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్గంలో ఉండేవారు.

ఇక ఎన్టీయార్ తనువు చాలించాక దాడి చంద్రబాబు వైపు వచ్చారు. విశాఖ జిల్లాలో దాడి కంటే కూడా మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికే చంద్రబాబు ఎపుడూ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. 2007లో మండలి ఏర్పాడినపుడు తొలిసారి స్థానిక కోటాలో ఆయన టీడీపీ తరఫున గెలిచారు. ఇక నాడు ఆయన మండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆ తరువాత రెండవమారు రెన్యువల్ చేయకపొవడంతో టీడీపీ నుంచి వేరుపడి వైసీపీలో చేరారు. నాడు వైసీపీ ఉమ్మడి ఏపీలో ఒక పార్టీగా మాత్రమే ఉంది. అధికారంలోకి వస్తామన్న ఆశలు కూడా లేవు.

ఇదే మాటను ఇపుడు దాడి గుర్తు చేస్తున్నారు. వైసీపీ కి పెద్దగా హైప్ లేని రోజులలో తాను మొదటిగా వచ్చి పార్టీలో చేరానని అంటున్నారు. ఆ రోజుల్లో ఎంతో మంది పెద్ద నాయకులు కూడా టీడీపీ సహా ఇతర పార్టీలలో ఉన్నారని, వారెవరూ వైసీపీ వైపు చూడని టైమ్ లో తాను జగన్ లో భావి సీఎం ని చూశాను అంటున్నారు. ఆ విధంగా ఆది నుంచి ఉన్న తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని బహుశా దాడి మాస్టార్ బాధగా ఉంది కాబోలు. తాను జగన్ నాయకత్వాన్ని ఇష్టపడతానని, ఆయన చెబితే ఏమైనా చేస్తాను అని కూడా మాస్టారు అంటున్నారు. తనకు వేరే వారి పెత్తనం ఇష్టం ఉండదని కూడా వైసీపీలో ఇతర నేతలకు ఆయన హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడారనుకోవాలి.

మొత్తానికి దాడి ఇలా ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పడం, వైసీపీలో కొందరి నేతల పోకడల గురించి ఇండైరెక్ట్ గా హెచ్చరించడం వంటివి చూస్తూంటే చాలా రాజకీయ అర్ధాలే ఉన్నాయని అంటున్నారు. ఇపుడు ఏపీలో 14 దాకా ఎమ్మెల్సీ ఖాళీలు ఉన్నాయి. అందులో తనకు ఒకటి జగన్ కేటాయించాలన్నదే మాస్టారు ఆలోచనగా చెబుతున్నారు. దాడి 2012 తరువాత ఏ అధికార పదవినీ అందుకోలేదు. ఆయనకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ చెప్పినా కూడా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. మరి ఇపుడు పెద్దల సభ మీద కన్నేసిన మాస్టార్ జగన్ ని పొగుడుతూనే తన సుదీర్ఘమైన పొలిటికల్  హిస్టరీ కూడా చెప్పుకుంటున్నారు. ఇది జగన్ కి అర్ధం కావాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఎన్నో సమీకరణలు లెక్కలు వేసుకుని ఏ పదవి ఎవరికి ఇవ్వాలో ఆచి తూచి  ఎంపిక చేసే జగన్ కి దాడి మాస్టారి సీనియారిటీ తెలియదు అనుకోగలమా. అయినా జగన్ మదిలో ఏముందో. అయితే ఒక్కటి మాత్రం నిజం. తనకు ఎమ్మెల్సీ దక్కపోతే దాడి మాస్టర్ ఈసారి చూస్తూ ఊరుకోరు అనే అంటున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో.
Tags:    

Similar News