అతిపెద్ద మురికివాడ‌లో క‌రోనా విజృంభ‌ణ‌

Update: 2020-04-12 08:11 GMT
భార‌త‌దేశ ఆర్థిక రాజ‌ధానిగా గుర్తింపు పొందిన మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై దేశంలోనే అతిపెద్ద న‌గ‌రం. వాణిజ్య కార్య‌క్ర‌మాల‌న్నీ ఇక్క‌డే జ‌రుగుతాయి. కోట్ల మంది ప్ర‌జ‌లు నివ‌సిస్తున్న ఈ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ కూడా అంతే స్థాయిలో విజృంభిస్తోంది. ఈ న‌గ‌రంలో బ‌స్తీలు - మురికివాడ‌లు అధిక సంఖ్య‌లో ఉంటాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా ముంబైలోని ధారావి గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్క ధారావి ప్రాంతంలోనే తాజాగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ ప్రాంతంలో మొత్తం నమోదైన కరోనా కేసులు 43. ఈ మురికివాడకు చెందిన నలుగురు కరోనాతో మృతి చెంద‌డంతో ఆ ప్రాంత‌వాసులు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఆ ధారావి ప్రాంతంలో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు కరోనాతో గ‌జ‌గ‌జ వ‌ణుకుతున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స్పందించింది. ధారావి ప్రాంత‌వాసులంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఆ ప్రాంతంలో నివసించే 7.5లక్షల మందికి ప‌రీక్ష‌లు చేసేందుకు బృహ‌న్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్టింది. 150 మంది ప్రైవేట్ వైద్యుల స‌హాయంతో పెద్దఎత్తున ప్ర‌జ‌ల‌కు ప‌రీక్ష‌లు చేయ‌నుంది. క‌రోనా సోకిన వారిని ఆస్ప‌త్రికి - అనుమానితుల‌ను క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌నున్నారు.

అయితే భారత‌దేశంలోనే అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ రాష్ట్రంలో శనివారం ఒక్క‌రోజే కొత్తగా 187 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా మొత్తం కేసులు 1,761కి చేరాయి. ఈ క్ర‌మంలో ఒక్క ముంబై న‌గ‌రంలోనే 1,146 కరోనా కేసులు, 76 మరణాలు సంభ‌వించ‌డంతో ఆ న‌గ‌రంలో ప‌రిస్థితులు భ‌యాందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం లాక్‌ డౌన్ ప‌క్కాగా అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 30వ తేదీ వ‌ర‌కు లాక్‌ డౌన్‌ ను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News