అబ్బో..అమ‌రావ‌తి ముఖ‌ద్వారం అదిరిపోనుందా?

Update: 2018-02-12 08:27 GMT
న‌వ్యాంధ్ర నూతన రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోనే మేటి న‌గ‌రంగా అభివృద్ధి చేస్తాన‌ని టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ప‌దే ప‌దే చెబుతున్నారు. ఎక్క‌డికెళ్లినా... ఇదే మాట ఆయ‌న నోటి నుంచి వినిపిస్తూనే ఉంది. అయితే అమ‌రావ‌తి నిర్మాణానికి కావ‌ల‌సిన నిధుల విష‌యంలో ఇప్ప‌టికే గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు అమ‌రావ‌తి రూపు రేఖ‌లు మ‌న‌కు క‌న‌బ‌డ‌వ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్ప‌టికే అమ‌రావ‌తికి కేంద్రం తానిచ్చిన‌ట్లుగా చెబుతున్న రూ.2,500 కోట్ల‌ను ఇత‌ర ప‌నుల‌కు త‌ర‌లించేసిన చంద్ర‌బాబు... అందులో అర‌కొర నిధుల‌నే... అది కూడా తాత్కాలిక స‌చివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణాల‌కే వెచ్చించార‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌పై కేంద్రం ఏమైనా నిధులు విడుద‌ల చేస్తే త‌ప్పించి... అమ‌రావ‌తి నిర్మాణం ముందుకు సాగే ప‌రిస్థితి లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అంటే... అమ‌రావ‌తికి ఓ రూపు రావాలంటే... 2019 ఎన్నిక‌లు పూర్తి కావాల్సిందే.

ఎందుకంటే... ఇప్ప‌టికిప్పుడు కేంద్రం ఎంతోకొంత నిధులిచ్చినా... ఇప్ప‌టికిప్పుడు ప‌నులు మొద‌లెట్టినా... ఎన్నిక‌ల స‌మ‌యానికి అవి పూర్తి అయ్యే సూచ‌న‌లు లేవు. అమ‌రావ‌తికి ఓ రూపు రాక‌పోతే ఏమిటి? అమ‌రావ‌తి ముఖద్వారానికి హంగులూ, ఆర్బాటాలు చేసి చూపుతామంటూ చంద్రబాబు స‌ర్కారు న‌డుం బిగించింది. ఇందులో భాగంగా విజ‌య‌వాడ‌ను ఆనుకుని కృష్ణా న‌దిపై ఉన్న వార‌ధికి స‌మీపంలో అమ‌రావ‌తి ముఖ‌ద్వారాన్ని భారీగా రూపుదిద్దేందుకు స‌ర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ భారీ ఏర్పాట్లు పూర్తి అయితే... అటుగా వెళ్లే ఏ ఒక్కరు కూడా దానిని చూసి అచ్చెరువొంద‌కుండా అక్క‌డి నుంచి క‌దిలే ప‌నే లేద‌ట‌. ఈ మేర‌కు ఇప్పుడు దీనిపై భారీ ఎత్తున వార్తా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఈ క‌థ‌నాల ప్ర‌కారం వార‌ధి వ‌ద్ద అమ‌రావ‌తి ముఖ‌ద్వారాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. భారీ ఆకారంలో క‌నిపించే ధ‌ర్మ‌చ‌క్రం నేప‌థ్యంగా ఈ ముఖ‌ద్వారా రూపుదిద్దుకోనుంద‌ట‌.

అమ‌రావ‌తి డెవ‌లప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ పేరిట ఓ కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం... ముఖ‌ద్వారం ఏర్పాటుకు ఏకంగా రూ.6 కోట్ల నిధుల‌ను మంజూరు చేసింద‌ట‌. డిజైన్‌లోనే కాకుండా... సైజులోనూ ఈ ధ‌ర్మ‌చ‌క్రం అమ‌రావ‌తికి వ‌చ్చేవారిని ఇట్టే ఆక‌ట్టుకుంటుంద‌ట‌. 2.5 కిలో మీట‌ర్ల ప‌రిధిలో విస్త‌రించ‌నున్న అమ‌రావ‌తి ముఖ‌ద్వారంలో ప్ర‌ధానంగా ధ‌ర్మ‌చ‌క్ర‌మే క‌నిపించినా... దాని చుట్టూ ప‌చ్చిక బ‌య‌ళ్లు కూడా భారీగానే ఏర్పాటు కానున్నాయ‌ట‌. ఇదిలా ఉంటే... రాజ‌ధాని నిర్మాణాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్న చంద్ర‌బాబు స‌ర్కారు... అమ‌రావ‌తి ముఖ‌ద్వారాన్ని మాత్రం ఈ ఏప్రిల్ నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చూద్దాం... అమ‌రావ‌తి ముఖద్వారం ఏ మేర ఆక‌ట్టుకుంటుందో?
Tags:    

Similar News