నిజనిర్ధారణ కమిటీలకు ‘‘అధర్మాన’’ లీడర్ షిప్పా?

Update: 2016-06-26 10:22 GMT
కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసి ఆ తరువాత వైసీపీలో చేరిన ధర్మాన ప్రసాదరావుపై ఆ పార్టీలో నేతలు సెటైర్లు వేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన కాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన ఆ తరువాత కొన్ని కేసుల నుంచి బయటపడ్డారు. ముఖ్యంగా కన్నెధార కొండ వ్యవహారం ధర్మాన ప్రసాదరావును మొన్నమొన్నటి వరకు వెంటాడింది. అప్పటి మంత్రుల్లో అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది ధర్మాన ప్రసాదరావే. కానీ.. వైసీపీలోకి వచ్చిన తరువాత ఆ పార్టీలో ఆయనకు విచిత్రంగా కొత్త బాధ్యతలు వచ్చిపడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా వేస్తున్న నిజ నిర్ధారణ కమిటీలను ఆయన ఆధ్వర్యంలోనే వేస్తున్నారు.

తాజాగా వివాదాస్పదమైన సదావతి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కూడా ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలోనే నిజనిర్థారణ కమిటీ వేశారు. ఇంతకుముందు రాజధాని భూములు, మరికొన్ని విషయాల్లోనూ ధర్మాన నేతృత్వంలోనే కమిటీలు వేశారు. ప్రస్తుతం సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు ధర్మాన కమిటీ ఇప్పుడు చెన్నైలో పర్యటిస్తోంది.  పాలంబూరులోని సత్రం భూములను కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీస్తోంది. ఇప్పటికే అమరావతిలోని సదావర్తి సత్రాన్ని నేతలు పరిశీలించారు. ఈ భూములను టీడీపీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా కొట్టేశారన్న ఆరోపణలున్నాయి.  మొత్తం 83 ఎకరాల భూమిని టీడీపీ ఎమ్మెల్యేలు - నేతలు స్వాహా చేశారని వైసీపీ ఆరోపిస్తోంది.

అయితే.. తాను పదవుల్లో ఉండగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మాన ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీలు వేయడంపై వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీలో క్లీన్ ఇమేజి ఉన్న నేతల ఆధ్వర్యంలో ఇలాంటి కమిటీలు వేస్తే ప్రజల్లో నమ్మకం ఉంటుంది కానీ ధర్మానతో నిజనిర్ధారణ కమిటీలు ఏమిటని కొందరు నేతలు అంటున్నారు. అవినీతి పరుడిగా ముద్రపడిన నేత ఇతరుల అవినీతిపై నిజనిర్ధారణ చేయడం నవ్వులాటగా ఉంటుందని అంటున్నారు. కొందరైతే ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లి ఈసారి ఇలాంటి కమిటీలు వేసినప్పుడు వేరే నేతలను ఎంపిక చేయాలని సూచించాలనుకుంటున్నారట.
Tags:    

Similar News