ఉపాధి కూలీలుగా ధోనీ - రస్సెల్ కూలీ ఎంతంటే - అసలు సంగతేమిటంటే?

Update: 2021-03-27 10:20 GMT
ప్రపంచ స్టార్ క్రికెటర్లైన ధోనీ, ఆండ్రూ రస్సెల్ ఉపాధి కూలీలు అవ్వడమేంటి , ఈ చిత్రం జరిగింది. తెలంగాణ కామారెడ్డి జిల్లాలో. మరింత షాకింగ్ ఏంటంటే, వీళ్లిద్దరూ వేలి ముద్రలు వేసి , కూలి డబ్బులు కూడా తీసుకున్నారు. అసలు ఇది ఎలా జరిగింది.  క్రికెటర్ల పేరుతో కూలి డబ్బులు ఎలా చేతులు మారాయి అనే డౌట్ రావచ్చు మనకు. కామారెడ్డి జిల్లా పెదకొడప్‌ గల్‌ మండలం , వడ్లం గ్రామంలో పొలానికి వెళ్లే దారి అధ్వాన్నంగా మారింది. అధికారులు ఎవ‌రికి చెప్పినా స‌మ‌స్య తీరలేదు. దాంతో మూడు నెలల కిందట కొంద‌రు రైతులు సొంత డ‌బ్బుల‌తో మ‌ట్టి రోడ్డు నిర్మించుకున్నారు.

ఆ రోడ్డు వేసేందుకు రూ.7 లక్షలు ఖ‌ర్చుచేశారు. ఇదే ఆదనుగా భావించిన ఉపాధి హామీ సిబ్బంది ఆ రోడ్డును ఉపాధి హామీలో చూపించి  డ‌బ్బులు తమ జేబుల్లో వేసుకోవచ్చని ఓ ప్లాన్ వేశారు. ఎవ‌రికి తెలుస్తుందిలే అనుకున్నారో ఏమో, ఆ రోడ్డు కోసం రూ.21 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించి, అడ్డగోలు బిల్లులు సృష్టించారు. వాటిని చూపించి డబ్బు డ్రా చేసుకున్నారు. కష్టం తమది, ప్రతిఫలం ఇంకొకరు పొందుతుంటే, ఆ రైతులకు ఒళ్లు మండదా "ఇంత దుర్మార్గమా , రోడ్డు వెయ్యకపోగా, తాము వేసుకున్న దానికి, డబ్బు కాజేస్తారా , వీళ్ల సంగతి తేల్చాల్సిందే" అనుకున్న రైతులు, ఎలా దొంగల్ని పట్టించాలో ఆలోచించారు. అందరూ కలిసి రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్లి స్కామ్ మొత్తం క్లారిటీగా వివరించి కంప్లైంట్ ఇచ్చారు. అసలే తెలంగాణలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగా జరుగుతోందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

ఈ తాజా తంతు ప్రజల్లోకి వెళ్లకముందే దీన్ని ఆపేయాలి అనుకున్న ఆర్డీవో రాజాగౌడ్‌ గ్రామంలో విచారించారు. ఉపాధి హమీ పనుల రిజిస్టర్‌‌లో రోడ్డు పనులు ఎవరు చేశారో చూశారు. ధోనీ, ఆండ్రూ ర‌స్సెల్ అనే ఇద్దరు క్రికెటర్లు చేసినట్లుగా పేర్లు ఉన్నాయి. అధికారులు షాక్ అయ్యారు. ఇంకే పేర్లూ లేనట్లు ఈ పేర్లెందుకు రాశారో అనుకుంటూ ఏం జరిగిందో తెలుసుకున్నారు. క్రికెటర్ల పేర్లు చెప్పి, ఉపాధి హామీ సిబ్బంది, డబ్బు కాజేశారు అర్థమైంది. కూలీ డ‌బ్బులు పొందేందుకు వేసిన వేలి ముద్రలు కూడా సిబ్బందివేనని తేలింది. దీనిపై కలెక్టర్‌కు నివేదిక‌ ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.
Tags:    

Similar News