డయల్ 100ను మర్చిపోండి.. గుర్తు పెట్టుకోవాల్సింది డయల్ 112

Update: 2021-08-06 03:31 GMT
అత్యవసర పరిస్థితులు అన్నంతనే గుర్తుకు వచ్చేది ‘‘డయల్ 100’’.  ఇప్పుడు డయల్ 100 స్థానంలో డయల్ 112 వచ్చింది. రానున్న రెండు నెలల వ్యవధిలో డయల్ 112ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఇకపై ఏ అత్యవసర సేవ అయినా సరే డయల్ 112కు చేస్తే.. అవసరమైన సాయం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం మనకు పోలీసు అవసరమైతే డయల్ 100.. వైద్య అత్యవసరానికి.. అంబులెన్సులకు 108.. ఫైర్ యాక్సిడెంట్లకు డయల్ 101.. ఇలా ఒక్కో అత్యవసర సేవకు.. ఒక్కో నెంబరు ఉండటంతో సేవలు పొందే విషయంలో పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి ఇబ్బందుల్నిఅధగమించేందుకు వీలుగా తాజాగా.. ఒకే నెంబరు విధానాన్ని అమల్లోకి తేనున్నారు.

అమెరికాలో ఏ అత్యవసర సేవకైనా సరే డయల్ 911కు చేస్తే సాయం ఇట్టే అందుతుంది. ఇప్పుడు అదే విధానాన్ని కాకుంటే డయల్ 112కు ఫోన్ చేస్తే.. సాయం అందుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయల్ 112 మీద అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే డయల్ 112తోనే పని చేసేలా చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతానికి మాత్రం డయల్ 100.. 108.. ఈ నెంబర్ల మీదా డయల్ 112 మీదా పని చేస్తాయి. రెండు నెలల తర్వాత మాత్రం పాత విధానానికి స్వస్తి పలికి.. పూర్తిగా డయల్ 112 లోకి వచ్చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

నిజానికి ఈ విధానాన్ని ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం తమకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యల్ని అధిగమించలేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ కారణంగా కేంద్రం అనుకున్నట్లుగా పని ముందుకు సాగని పరిస్థితి. అందుకే.. డయల్ 112ను త్వరలో దేశ వ్యాప్తంగా అందరికి అందుబాటులోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. నిజానికి ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం రెండేళ్ల క్రితమే అనుకున్నా.. వాస్తవ రూపం దాల్చలేదు. త్వరలోనే పాత విధానం పోయి.. కొత్త విధానం అందుబాటులోకి వచ్చేస్తుందని చెబుతున్నారు. సో.. డయల్ 100ను వదిలేసి డయల్ 112ను గుర్తు పెట్టుకోవటం చాలా అవసరం. అంతవరకు ఎందుకు? మీ మొబైల్ ఫోన్లో ఇప్పుడే సేవ్ చేసుకుంటే సరిపోతుంది.
Tags:    

Similar News