అసద్ ఐడియాను కేసీఆర్ ఫాలో అయ్యారా? ట్వీట్ చెబుతున్నది ఇదేనట

Update: 2022-09-04 04:30 GMT
సెప్టెంబరు 17 అన్నంతనే.. ఒకరు తెలంగాణ విమోచన దినోత్సవం అంటే మరొకరు తెలంగాణ విలీన దినోత్సవంగా అభివర్ణించటం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ వాదనలకు సరికొత్తగా జాతీయ సమైక్యతా దినోత్సవం అన్నదొకటి వచ్చి చేరింది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న వేళలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నోటి నుంచి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా పేర్కొనటమే కాదు.. తాము అధికారంలోకి వచ్చినంతనే అధికార దినోత్సవంగా నిర్వహిస్తామని చెప్పటం తెలిసిందే. పవర్లోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడని కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఈసారి సెప్టెంబరు 17ను పురస్కరించుకొని మూడు రోజుల పాటు వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు చెప్పి కొత్త వ్యూహానికి తెర తీశారు.

నిజాం రాజుల హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ.. మహారాష్ట్రలోని కొంత భాగం.. కర్ణాటకలోని మరికొంత భాగమన్న విషయం తెలిసిందే. ఈ మూడు భాగాలు కలిపితేనే హైదరాబాద్ స్టేట్ అవుతుంది. ఎప్పుడైతే హైదరాబాద్ స్టేట్ ను భారత ప్రభుత్వం తమలో కలిపేసుకుందో.. అప్పుడు ఏ భాష మాట్లాడే ప్రజల్ని ఆ భాషకు చెందిన ప్రాంతాలుగా విడదీసి.. వేర్వేరు చేసింది.  మహారాష్ట్ర.. కర్ణాటకలో సెప్టెంబరు 17ను పురస్కరించుకొని వేడుకలు జరుగుతున్నా.. తెలంగాణలో మాత్రం అధికారికంగా ఇప్పటివరకు జరిగింది లేదు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న వేళలో బీజేపీ.. టీఆర్ఎస్ లు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరినా దాన్ని పట్టించుకునేది కాదు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్ఎస్ ఇదే ధోరణిని ప్రదర్శించింది. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు అవుతోంది. దీనికి కారణం బీజేపీనే. తెలంగాణలో పాగా వేయటం కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్న కమలనాథులు.. సెప్టెంబర్ 17ను పెద్ద ఎత్తున నిర్వహించటం ద్వారా సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి.

ఇందులో భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పటమే కాదు.. దీనికి సంబంధించిన భారీ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరవుతారని బీజేపీ వెల్లడించింది. ఇలాంటివేళ.. బీజేపీకి ధీటుగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన ప్రారంభ.. ముగింపు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని డిసైడ్చేశారు. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా కార్యక్రమాల్ని నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు. అయితే.. కేసీఆర్ చేసిన ప్రకటనకు సంబంధించిన అసలు ఐడియా మజ్లిస్ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీదన్న విషయం వెలుగు చూసింది.

అది కూడా తన అధికార ట్విటర్ ఖాతాలో అసద్ ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాను చేసిన సూచనను పరిగణలోకి తీసుకొని.. దాన్ని స్వాగతిస్తూ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించేందుకు కేసీఆర్ సర్కారు ముందుకు రావటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి.. కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్న ఎనిమిదేళ్లుగా ఈ ఉత్సవాన్ని పట్టించుకోని టీఆర్ఎస్.. మజ్లిస్ లు ఇప్పుడు మాత్రం మూడు రోజుల పాటు ఉత్సవాల్ని నిర్వహిస్తున్న వైనం చూస్తే.. బీజేపీ పుణ్యమా అని కొత్త ఎత్తులకు తెర తీశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News