కిషన్ రెడ్డికి ప్రమోషనా? డిమోషనా?

Update: 2023-07-05 09:50 GMT
తెలంగాణ కమల దళపతిగా కిషన్ రెడ్డిని ఎంపిక చేస్తూ బీజేపీ జాతీయ వర్గం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అన్నట్లుగా రోటీన్ కు భిన్నంగా తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేగటం.. టీ బీజేపీ సారధిగా ఉన్న బండి సంజయ్ ను సాగనంపేందుకు రంగం సిద్ధమైందన్న వాదనలు జోరుగా వినిపించటం.. ఆ వార్తలకు బలం చేకూరేలా..తెలంగాణలో  ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సభకు తాను అధ్యక్షుడి హోదాలో హాజరువుతానో లేదో అన్న మాట రావటంతోనే.. బండికి స్థానచలనం ఖరారైందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది.

ఇందుకు తగ్గట్లే మంగళవారం ఆయన్ను తెలంగాణ బీజేపీ సారధిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఈ స్థానం కిషన్ రెడ్డికి ప్రమోషనా? డిమోషనా? అన్నదిప్పుడు కొత్త చర్చగా మారింది.

ఎందుకంటే.. ఇప్పటికే ఉమ్మడి ఏపీ.. తెలంగాణ బీజేపీ సారధిగా రెండుసార్లు పని చేసిన ఆయనకు.. తాజాగా మూడోసారిపార్టీ పగ్గాల్ని ఇవ్వటాన్ని ప్రశ్నిస్తున్నారు. గడిచిన రెండు దఫాల్లో పార్టీని విస్తరించే విషయంలోనూ.. క్రేజ్ తీసుకొచ్చే విషయంలోనూ కిషన్ రెడ్డి ట్రాక్ రికార్డు ఏ మాత్రం గొప్పగా కనిపించదు.

అలాంటప్పుడు.. కీలకమైన ఎన్నికల వేళలో కిషన్ రెడ్డికి టీ బీజేపీ బాధ్యతల్ని అప్పజెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ కు బీజేపీ బి పార్టీగా మారిందన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళలో.. కిషన్ రెడ్డిని ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ యువమోర్చాకు రాష్ట్ర అధ్యక్షుడిగానే కాదు.. జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్ రెడ్డి.. గతంలోనే రెండు దఫాలు ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నియమితులయ్యారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి.. 2018లోఎమ్మెల్యేగా ఓడిపోవటం.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. తర్వాత కేంద్ర మంత్రిగా అప్ గ్రేడ్ కావటం తెలిసిందే.

అలాంటి కిషన్ రెడ్డి చేతికి తాజాగా తెలంగాణ పార్టీ పగ్గాలు అందించటం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ బీజేపీలో గ్రూపులు పెరిగిపోయిన నేపథ్యంలో.. వాటిని చక్కదిద్ది పార్టీని ఒక గాడిన పెట్టే సత్తా కిషన్ రెడ్డికి ఉందని పార్టీ జాతీయ నాయకత్వం భావించినట్లుగా చెబుతారు.

అయితే.. అంతకంతకూ ఉన్నత స్థాయికి చేరాల్సిన కిషన్ రెడ్డి.. అందుకు భిన్నంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావటం ఏమిటి? మూడోసారి రాష్ట్ర పగ్గాలు సొంతం చేసుకోవటం పెద్ద విషయం కాదని.. ఆయన వ్యక్తిగత కెరీర్ కోణంలో చూస్తే.. ఇదే మాత్రం ప్రమోషన్ కాదని.. డిమోషన్ అన్న వాదన బలంగా వినిపించటం గమనార్హం.

Similar News