పీకే మార్క్ అప్పుడే క‌న‌ప‌డిందా? వైసీపీ మంత్రి ద్వారా

Update: 2022-03-09 04:25 GMT
ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే). రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌. తిమ్మిని బ‌మ్మిని చేయ‌డంలోనూ.. లేనివి క‌ల్పించ‌డంలోనూ.. ఉన్న‌వాటిని అణగ‌దొక్కి.. కొత్త వాద‌న‌ను తెర‌మీదికి తేవ‌డంలోనూ.. ఆయ‌నను మించిన వ్యూహ‌క‌ర్త లేడ‌ని అంటారు ప‌రిశీల‌కులు. గ‌తంలో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో  జ‌గ‌న్‌కు వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేసిన‌ప్పుడు.. ఇవే సూత్రాల‌ను అవ‌లంబించారు. కాపుల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం చేసి, రెడ్ల‌కు అనుకూలంగా మ‌లిచారు. అదేవిధంగా క్షేత్ర‌స్థాయిలోనూ గ్రూపులు ఏర్ప‌డేలా.. రాజ‌కీయాలు మారేలా వ్య‌వ‌హ‌రించి.. జ‌గ‌న్‌కు అధికారం ద‌క్కించ‌డంలో ఒక ప‌ద్ధ‌తి ప్రకారం ముందుకు సాగారు.

ఇక‌, ఇప్పుడు ఇదే పీకే.. తెలంగాణ అధికార పార్టీ కేసీఆర్‌కు ప‌నిచేస్తున్నారు. అక్క‌డ ఇప్ప‌టికే స‌ర్వేలు కూడా చేయిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో(అవి ఎప్పుడు జ‌రిగినా) కేసీఆర్ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టేలా పీకే వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించిన కీల‌క అంశం.. తెలంగాణ వాదులు కేసీఆర్‌కు, టీఆర్ ఎస్‌కు దూరంగా ఉన్నార‌ని.. అంతేకాదు, వారు ఆగ్ర‌హంతో కూడా ఉన్నార‌ని.. పీకే స‌ర్వేలో స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో వ్యూహానికి తెర‌దీసిన‌ట్టు తెలుస్తోంది. అదే.. మ‌రోసారి తెలంగాణ సెంటిమెంట్‌!!

ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంటును ఏపీ వైపు నుంచి న‌రుక్కొచ్చి.. అంతిమంగా కేసీఆర్‌కు ల‌బ్ధి చేకూర్చే బిగ్ ప్లాన్ ఏదో వేశార‌ని రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న ప‌రిణామాల‌ను.. రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే.. ఏపీలో ఒక వ్యూహాత్మ‌క రాజ‌కీయ కోణం క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. తాజాగా ఏపీ రాజ‌ధాని వివాదంపై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆస‌క్తిగా స్పందించారు. హైద‌రాబాదే ఏపీకి రాజ‌ధాని అని.. వ‌చ్చే 2024 వ‌ర‌కు కూడా ఇదే రాజ‌ధానిగా ఉంటుంద‌ని.. బొత్స వ్యాఖ్యానించారు.

ఇదే .. అందరికీ అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా పెద్ద ఎత్తున సందేహాలు వ్య‌క్తం చేస్తోంది. నిజానికి 2014కు ముందుగానే రాష్ట్రం విడిపోయింది. అప్ప‌ట్లోనే ఏపీకి వ‌చ్చేశారు. ప్ర‌భుత్వం కూడా 2014 చివ‌రిలో(చంద్ర‌బాబు) ఏపీకి వ‌చ్చేసి.. ఇక్క‌డే రాజ‌ధాని ఏర్పాటు ప్ర‌క‌టించారు. సో.. ప్ర‌జ‌లు కూడా మాన‌సికంగా.. హైద‌రాబాద్‌కు ఎప్పుడో దూర‌మ‌య్యారు. అక్క‌డ స్థిర‌ప‌డిన వారు.. లేదా వ్యాపారాలు చేసుకుంటున్న వారు మిన‌హా.. ఏపీ ప్ర‌జ‌లు మాత్రం అమ‌రావ‌తినే రాజ‌ధానిగా(వైసీపీ వ‌చ్చాక మార్పు గురించి కాదు) భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో హ‌ఠాత్తుగా వైసీపీ మంత్రి బొత్స హైద‌రాబాద్ మా రాజ‌ధాని అని ప్ర‌క‌టించ‌డం అంటే.. దీనివెనుక పీకే వ్యూహం ఉంద‌ని.. ఆయ‌నే అలా చెప్పిస్తున్నార‌ని.. ప‌రోక్షంగా, లేదా ప్ర‌త్య‌క్షంగా కేసీఆర్‌కు మేలు చేయాల‌నే ఉద్దేశంతో  పీకే చేస్తున్న రాజ‌కీయ విన్యాసమ‌ని మేధావులు సైతం అంటున్నారు.

ఇప్పుడు ఈ వీడియోల‌ను దాచిపెట్టి.. తెలంగాణ‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. ఈ రికార్డుల‌ను బ‌య‌ట‌కు తీసి.. తెలంగాణ సెంటిమెంటును ర‌గిలించి.. "అదిగో ఆంధ్రోళ్లు మ‌ళ్లీ మ‌న‌పై పెత‌త్నానికి రెడీ అయ్యిన్రు!" అని కేసీఆర్ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే కార్య‌క్ర‌మానికి.. ఓట్ల ల‌బ్ధి పొందే కార్య‌క్ర‌మానికి ఇప్పుడే తెర‌దీశార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News