దీదీని తప్పుపట్టిన డీఎంకే ఎంపీ

Update: 2021-12-20 05:26 GMT
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి వ్యవహార శైలిని డీఎంకే పార్టీ తప్పుపట్టింది. మమత అనుసరిస్తున్న విధానాల వల్ల ఎన్డీఏకి మాత్రమే ఉపయోగమని డీఎంకే ఎంపీ బాలు స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షాల్లో చీలికకు మమత ప్రయత్నించటం ముమ్మాటికి తప్పే అన్నారు. నిజంగానే ఎన్డీయే మీద మమత పోరాడుతుంటే ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేయాలిగాని విచ్ఛిన్నానికి కాదన్నారు.

ఈమధ్యనే మమత మాట్లాడుతు యూపీఏ ఎక్కడుందంటు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. నిజానికి యూపీఏ విషయంలో మమత చాలా ఎగతాళిగా మాట్లాడారు. ఒకవైపు ఎన్డీయేని అధికారంలో నుండి దింపేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రయత్నిస్తుంటే మమత మాత్రం యూపీఏనా ? అదెక్కడుంది ? అంటు ఎగతాళిగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ఇదే విషయమంలో మమత వైఖరిని డీఎంకే ఎంపీ తప్పుపట్టారు.

వచ్చే ఏడాదిలో జరగబోతున్న రాష్ట్రపతి ఎన్నికలోనే ప్రతిపక్షాల ఐక్యత ఏమిటో అందరికీ అర్ధమవుతుందని బాలు చెప్పారు. ఎన్డీయే అభ్యర్ధిని ఓడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక అభ్యర్ధిని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి దింపితే గెలిపించుకోవటం పెద్ద కష్టమేమీ కాదని బాలు అభిప్రాయపడ్డారు.

కాకపోతే మమత లాంటివాళ్ళు కలసిరావాలన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోతే లాభపడేది ఎన్డీయేనే అన్న చిన్నవిషయాన్ని మమత మరచిపోయినట్లున్నారని బాలు చురకలంటించారు.

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని వెళ్ళే మార్గాన్ని మమత చూసుకోవాలన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలన్న మమత ఆలోచనలో తప్పు లేదన్న బాలు కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టేయటం మాత్రం సాధ్యం కాదన్నారు. ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తీసుకురావటానికి కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చేస్తున్న కృషిని బాలు గుర్తుచేశారు.




Tags:    

Similar News